వ్యక్తి కాదు శక్తి…! ఇక సెలవంటూ నిష్క్రమించిన మేరుపర్వతం రామోజీరావు

తెలుగునాట తన వ్యాపారాలను నలుదిశలా విస్తరించిన రామోజీరావు సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా కీర్తి గడించారు. పద్మవిభూషణుడిగా ఓ చరిత్రను నమోదు చేశారు.

వ్యక్తి కాదు శక్తి…! ఇక సెలవంటూ నిష్క్రమించిన మేరుపర్వతం రామోజీరావు

Ramoji Rao Life Story : ఒక శకం ముగిసింది. మేరుపర్వతం దివికేగింది. సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా… తెలుగుజాతి కీర్తి కిరీటంగా పేరుగాంచిన పద్మవిభూషణ్‌ రామోజీరావు అస్తమించారు. భారతదేశపు ‘రూపర్ట్ మర్డోక్’గా చెప్పుకునే చెరుకూరి రామోజీరావు అంటే వ్యక్తి కాదు.. అతడో శక్తి… అతడో రుషి.. వ్యాపారవేత్తగా, మీడియా సామాజ్యపు అధినేతగా, సినీ నిర్మాతగా, సామాజిక సేవకుడిగా సేవలందించిన రామోజీ… వేల కుటుంబాల జీవనజ్యోతి… ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించిన రామోజీ ప్రజల మదిలో చిరస్మరణీయులు.

మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు చెరుకూరి రామోజీరావు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్‌ రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించిన పారిశ్రామిక వేత్త. మార్గదర్శితో వ్యాపారం మొదలుపెట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లు అతిపెద్ద సామ్రాజ్యాన్నే నిర్మించిన తెలుగువెలుగు రామోజీరావు. నిత్యకృషీవలుడు. పోరాట యోధుడు. అక్షర సైనికుడు. ఈనాడును స్థాపించి ప్రతి ఉదయం తెలుగుప్రజలను ముందుగా పలకరించేవారు రామోజీరావు. తన పత్రిక ద్వారా వార్తల ప్రచురణకే పరిమితం కాలేదు. సమాజ సేవ చేయడానికి.. సామాజిక రుగ్మతలపై ఉద్యమానికి నాయకత్వం వహించారు రామోజీరావు.

రామోజీ అస్తమించారనే వార్త… తెలుగునాట తీవ్ర విషాదాన్ని నింపింది. మీడియా, సినిమా, షాపింగ్‌, పర్యాటక రంగాల్లో తనదైన ముద్రవేసిన రామోజీరావు.. ఈనాడు, మార్గదర్శి, డాల్ఫిన్‌ హోటల్స్‌, కళాంజలి, ప్రియాఫుడ్స్‌, మయూరి డిస్ట్రిబ్యూటర్స్‌, ఈటీవీ, ఉషాకిరణ్‌ మూవీస్‌, మార్గదర్శి చిట్స్‌ ఇలా.. ఎన్నో సంస్థలను స్థాపించి వేలాది కుటుంబాల జీవనజ్యోతిగా నిలిచారు. వేల మందికి ఉపాధినిచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. రామోజీ సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రతి ఊరులో ఉంటారంటే అతిశయోక్తి కాదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతూ రామోజీ అన్న గొడుగు కింద బతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే రామోజీ మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదంగా మారింది.

కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రామోజీరావు. తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మకు మూడో సంతానం. తల్లిదండ్రులు ఆయనకు రామయ్య అనే పేరు పెడితే… స్కూల్లో చేరినప్పుడు రామోజీరావుగా తనకు తానే పేరు పెట్టుకున్నారు. చిన్నతనం నుంచే విలక్షణ, సృజనాత్మకత ప్రదర్శించే రామోజీరావు… చదువు మీద కన్నా కళలు, రాజకీయాల మీద ఎక్కువ ఆసక్తి చూపారు. ఆపాటల్లోనూ చురుగ్గా ఉండేవారట.

ఢిల్లీలో అనంత్‌ అనే మళయాళీ స్థాపించిన యాడ్‌ ఏజెన్సీలో ఆర్టిస్ట్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు రామోజీరావు. 1961 ఆగస్టు 19న వివాహం జరిగిన తర్వాత 1962లో హైదరాబాద్‌కు తిరిగివచ్చి… అదే ఏడాది అక్టోబర్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్‌ను స్థాపించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రామోజీ తర్వాత ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. ఢిల్లీలో యాడ్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవంతో 1965లో తన పెద్ద కుమారుడు కిరణ్ పేరుతో ఇక్కడా యాడ్‌ ఏజెన్సీ ప్రారంభించారు. అదే విధంగా ఖమ్మం పట్టణంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం చేశారు. ఆ సమయంలో రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు.

1970లో భార్య రమాదేవి ఎండీగా ఇమేజెస్ ఔట్ డోర్ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని ప్రారంభించిన రామోజీరావు… 1972-73లో విశాఖలో డాల్ఫిన్ హోటల్ ప్రారంభించారు. ఆ తర్వాత ఈనాడు పత్రిక స్థాపించడం ద్వారా తెలుగునాట పెను సంచలనం సృష్టించారు రామోజీరావు. 1974లో విశాఖ కేంద్రంగా ఈనాడు స్థాపించి.. అనతికాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. జిల్లా ఎడిషన్లను తీసుకువచ్చి, జర్నలిజంలో సరికొత్త చరిత్ర నమోదుచేశారు.

ఇక ఈనాడు జర్నలిజం కళాశాలను ప్రారంభించి… ఎందరో నికార్సైన జర్నలిస్టులను తయారుచేశారు. ప్రస్తుతం వివిధ మీడియా సంస్థల్లో ప్రముఖ స్థానాల్లోఉన్న ఎందరో జర్నలిస్టులు… రామోజీరావు అక్షర సేద్యం ద్వారా బయటకు వచ్చిన వారే. సినీ జనం కోసం సితార, సాహితీ ప్రియుల కోసం చతుర, వివిధ భాషా కథల సమాహారంగా విపుల రామోజీ గ్రూపుల నుంచి వెలువడ్డాయి. ప్రియా ఫుడ్స్‌ ద్వారా పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టిన రామోజీ ఆ రంగంలోనూ తనకెవరూ సాటిలేరని నిరూపించారు.

1983లో ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించిన రామోజీరావు… తెలుగులో మంచి సూపర్‌హిట్‌ సినిమాలను నిర్మించారు. ఈనాడుతో ప్రతి ఉదయం పాఠకులను పలకరించే రామోజీరావు 1995లో టెలివిజన్‌ రంగంలోకి ప్రవేశించారు. ఎంటర్‌టైన్ మెంట్‌ రంగంలో ఈటీవీని ప్రారంభించి…. వార్తల కోసం తొలుత రాత్రి 9 గంటలకు ఓ అరగంట స్లాట్‌ కేటాయించారు. ఆ ప్రొగ్రామ్‌కి మంచి ఆదరణ లభించడంతో ఆ తర్వాత తెలుగులో తొలి 24 గంటల వార్తా చానల్‌ను ప్రారంభించారు. ఆ తరువాత ఇతర భాషల్లో చానెళ్లు విస్తరించారు. కొన్నాళ్లకు వ్యాపార అవసరాల రీత్యా, తెలుగు న్యూస్‌ చానళ్లను మాత్రమే ఉంచుకుని, మిగతా నెట్‌వర్క్‌ను విక్రయించారు రామోజీరావు.

ఈనాడు పత్రికకు సంపాదకుడిగా కొనసాగిన రామోజీరావు 2019లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రజా సమస్యలపై సంపాదకీయాలు రాయడం ద్వారా ప్రభుత్వాలను ఎండగట్టేవారు. అయితే తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌తో సన్నిహితంగా ఉండేవారు. ఈనాడు టీడీపీ కోసమే పనిచేస్తుందనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్‌ మరణం తర్వాత చంద్రబాబుతోనూ సత్సంబంధాలు నెరిపారు రామోజీరావు.

మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ అగ్రనేతలతోనూ రామోజీకి మంచి సంబంధాలే ఉండేవి. బీజేపీ ముఖ్యనేతలు ఎల్‌కే అద్వానీ, ప్రస్తుత హోంమంత్రి అమిత్‌షా వంటివారు కూడా రామోజీతో స్నేహంగానే ఉంటారు. రామోజీని వ్యతిరేకించే పార్టీల్లో సైతం ఆయనకు సన్నిహితులు ఉండేవారని చెబుతుంటారు. ఇలా తెలుగునాట తన వ్యాపారాలను నలుదిశలా విస్తరించిన రామోజీరావు సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా కీర్తి గడించారు. పద్మవిభూషణుడిగా ఓ చరిత్రను నమోదు చేశారు.

Also Read : రామోజీరావుని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు లేదు- పవన్ కల్యాణ్