Srushti Test Tube Center Case: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు.. మరో లేడీ డాక్టర్ అరెస్ట్.. పరారీలో ముగ్గురు..
అమాయక యువతీ యువకులకు డబ్బు ఆశ చూపి స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నారు కేటుగాళ్లు.

Srushti Test Tube Center Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైదరాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఫ్రాడ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాఫ్తులో దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో పోలీసులు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
డాక్టర్ నమ్రతకు సహకరించిన మరో మహిళా డాక్టర్ కళ్యాణిని విజయవాడలో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు. డాక్టర్ నమ్రత కొడుకు సంజయ్ న్యాయవాది కావడంతో పలువురు బాధితులను బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ కేంద్రంగా స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్న పంకజ్ అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమాయక యువతీ యువకులకు డబ్బు ఆశ చూపి స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నారు కేటుగాళ్లు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ తమ లిస్టులో లేదని విజయవాడ డీఎంహెచ్ వో డాక్టర్ సుహాసిని తెలిపారు. రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్, మైక్రో బయాలజిస్ట్ ఉన్నప్పుడే బేబీ సెంటర్ కు పర్మిషన్ వస్తుందన్నారు. జడ్జి, కలెక్టర్ ఆధ్వర్యంలో బేబీ సెంటర్లకు పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్ని పర్మిషన్లు వచ్చాకే రిజిస్ట్రేషన్ నెంబర్లు కేటాయించడం జరుగుతుందని డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని వెల్లడించారు.
విజయవాడలోనూ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. దీనిపై ఫోకస్ పెట్టిన పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. వ్యాపార అభివృద్ధి కోసం డాక్టర్ నమ్రత విజయవాడలోని సృష్టి ఆసుపత్రిలో 9 రోజుల పాటు పూజలు నిర్వహించినట్లు పోలీసులు తేల్చారు. బీహార్ నుంచి పూజారులను పిలిపించి హోమాలు చేయించినట్లు గుర్తించారు. విజయవాడలోని సెంటర్ లో ముగ్గురు వైద్యుల ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో ఇక్కడ సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. హాస్పిటల్ లో 2015 నుంచే సృష్టి సంతాన సాఫల్య కేంద్రంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అయినా 2015 నుంచి 2020 వరకు ఏకంగా 40మందికి సరోగసీ నిర్వహించినట్లు తెలుస్తోంది.