Sunburn Event : న్యూఇయర్ వేడుకలు, సన్‌బర్న్ ఈవెంట్‌.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

బుక్ మై షో నిర్వాహాకులపై కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తేల్చి చెప్పారు. ఆ తర్వాతే టికెట్లు విక్రయించాలని ఆదేశించారు.

Sunburn Event : న్యూఇయర్ వేడుకలు, సన్‌బర్న్ ఈవెంట్‌.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

Hyderabad Police Gives Warning Regarding Sunburn Event

Updated On : December 25, 2023 / 5:21 PM IST

న్యూ ఇయర్ వచ్చేస్తోంది. దీంతో అంతా సెలబ్రేషన్స్ కు రెడీ అయిపోతున్నారు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్రిపేరేషన్స్ జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో న్యూఇయర్ ఈవెంట్స్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అనుమతులు లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక సన్ బర్న్ ఈవెంట్ కు ఎలాంటి అనుమతలు లేవని తేల్చి చెప్పారు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి.

అనుమతులు లేకుండా సన్ బర్న్ ఈవెంట్ టికెట్లు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిపించి హెచ్చరించిన సీపీ.. అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా సరే తప్పకుండా అనుమతులు తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు సీపీ అవినాశ్ మహంతి.

న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే వారికి ఇప్పటికే నియమ నిబంధనలు జారీ చేశామని మాదాపూర్ అదనపు డీసీపీ నంద్యాల నర్సింహా రెడ్డి తెలిపారు. కాగా, సన్ బర్న్ ఈవెంట్ కు అనుమతి లేదని స్పష్టం చేశారు. కానీ అనుమతులు తీసుకోకుండా సన్ బర్న్ ఈవెంట్ కు సుమంత్ అనే వ్యక్తి బుక్ మై షో లో టికెట్లు విక్రయిస్తున్నాడని, అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు. సన్ బర్న్ ఈవెంట్ నిర్వాహాకులు, బుక్ మై షో ఎండీ సహా నోడల్ అధికారికి నోటీసులు జారీ చేశామన్నారు.

Also Read : కాంగ్రెస్‌కు చుక్కలు చూపేలా స్కెచ్ వేసిన బీఆర్‌ఎస్ పార్టీ..!

సన్ బర్న్ ఈవెంట్ కోసం మాకు దరఖాస్తు చేశారు. ఎక్సైజ్ సహా ఇతర అనుమతులు తీసుకోలేదు. అందుకే అనుమతి నిరాకరించాం అని డీసీపీ వెల్లడించారు. సన్ బర్న్ పేరును వాడుకుని నిర్వహిస్తున్నారు కానీ ఇది సన్ బర్న్ ప్రధాన వేడుక కాదన్నారు. ఈవెంట్లు నిర్వహించే పబ్బులకు, నిర్వాహకులకు డ్రగ్స్ అక్కడికి రాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళదే అని తేల్చి చెప్పారు. ఈవెంట్ కి వచ్చే వారి ఐడీ కార్డు సహా బ్యాగులు తనిఖీ చేసి లోపలికి అనుమతించాలన్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, పార్కింగ్ ప్రదేశాలు ఉండాలి, అధిక సంఖ్యలో పాసులు జారీ చేయకూడదు అని చెప్పారు.

”సన్ బర్న్ పేరు లాయల్టీని వాడుకుని న్యూఇయర్ వేడుకకు 21న అనుమతి కోసం వచ్చారు. మాదాపూర్ లో ఇప్పటివరకు 22 ఈవెంట్లకు అనుమతి ఇచ్చాము. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తాము. సన్ బర్న్ వాళ్ళు ఫార్మాట్ ప్రకారం దరఖాస్తు చేసుకోలేదు. ఎక్సైజ్ నుండి లెటర్ లేకుండానే పోలీస్ అనుమతి కోరారు. అందుకే అనుమతి నిరాకరించాము. అనుమతి లేకుండానే టికెట్లు విక్రయించారు కాబట్టి కేసు నమోదు చేశాము. బుక్ మై షో వాళ్లకు నోటీసులు ఇస్తాము” అని మాదాపూర్ అదనపు డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి వెల్లడించారు.

Also Read : నల్గొండ జిల్లాలో పండగపూట విషాదం.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

అనుమతి తీసుకోకుండానే సన్ బర్న్ ఈవెంట్ కు టికెట్లు విక్రయించడంతో బుక్ మై షో నిర్వాహాకులపై కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. కాగా, కొత్త సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తేల్చి చెప్పారు. ఆ తర్వాతే టికెట్లు విక్రయించాలని ఆదేశించారు. సన్ బర్న్ ఈవెంట్ కోసం నిర్వాహాకులు దరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వలేదు పోలీసులు. సన్ బర్న్ ఈవెంట్ ఇతర నగరాల్లో జరిగే వేడుకలాంటిది కాదన్నారు. అనుమతి లేకున్నా టికెట్లు విక్రయించడంతో వార్నింగ్ ఇచ్చామన్నారు.