Telangana Congress: వారిపైనే గురి! ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లు వ్యూహాత్మకంగా అడుగులు..

అధికార పార్టీలో అసంతృప్తి తో ఉన్న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఇతర నేతలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు సంప్రదింపులు జరుపుతున్నారు.

Telangana Congress: వారిపైనే గురి! ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లు వ్యూహాత్మకంగా అడుగులు..

MP Uttam Kumar Reddy

Updated On : October 17, 2023 / 3:06 PM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు వ్యూహాలకు పదునుపెడుతూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈదఫా ఎన్నికల్లో అధికారపీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టుదలతో ఉన్నారు. 119 నియోజకవర్గాలకుగాను తొలి విడతలో 55 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాల్లో మరో రెండుమూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. టికెట్లు దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారాన్ని మొదలు పెట్టారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సీనియర్ నేతలు జిల్లాలో అన్నినియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలపై దృష్టిపెట్టారు.

Read Also : Kamareddy: కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?

అధికార పార్టీలోని అసంతృప్తులపై గురి..
అధికార పార్టీలో అసంతృప్తి తో ఉన్న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఇతర నేతలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో నల్గొండ మున్సిపాలిటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన, పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కోదాడ నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, శశిధర్ రెడ్డి తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సాగర్ నియోజకవర్గంలో పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీ లతో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. వీరందరిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చడం ద్వారా ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read Also : Revuri Prakash Reddy : కాంగ్రెస్ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి

శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన ఉత్తమ్..
కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ ఛార్జి కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వైఖరితో ఉద్యమ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని, స్థానిక ఎమ్మెల్యే ఇతర నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదాడ నియోజకవర్గం అవినీతి మయంగా మారిందని, గంజాయికి కేంద్ర బింధువుగా కోదాడ ఉందంటూ ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపీడి జరుగుతున్న విషయం తెలిసికూడా బీఆర్ఎస్ పార్టీ బొల్లం మల్లయ్యకు టికెట్ ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. పోలీసులు, అధికారులు తమ పరిధి దాటవద్దని ఉత్తమ్ కోరారు. జాతీయ పార్టీ నుంచి కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మావతి ఉన్నా మాకు పోలీసులు బందోబస్తు ఇవ్వడం లేదని, ఎమ్మెల్యే బొల్లంకు పోలీసులు ఎందుకు బందోబస్తు ఇస్తున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. త్వరలోనే స్థానిక పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఉత్తమ్ హెచ్చరించారు.

బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నా.. శశిధర్ రెడ్డి
2010 నుంచి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ లో కొనసాగుతున్నా. 2014లో పోటీ చేయడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే వ్యవహారశైలి గురించి ఎప్పటికప్పుడు అధిష్టానంకు తెలియజేస్తున్నా. అయినా వారు పట్టించుకోవటం లేదని శశిధర్ రెడ్డి అన్నారు. పార్టీ మీద ఎలాంటి కోపం లేదు. స్థానిక ఎమ్మెల్యే వల్లనే పార్టీ మారుతున్నానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శశిధర్ రెడ్డి వెల్లడించారు.