Jana Sena Party : ఈసారి వెనక్కి తగ్గొద్దు.. పవన్ కల్యాణ్ కు తెలంగాణ జనసేన నేతల విజ్ఞప్తి
నేతల అభిప్రాయాలకు పవన్ స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్థం చేసుకోగలను. అయితే, తనమీద ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. నాయకులు, జనసైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు.
Jana Sena -Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో పాటు ప్రచారాన్నిసైతం ప్రారంభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణలోని జనసేన నేతలు పలు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన నేతలు అధినేతకు పలు విజ్ఞప్తులు చేశారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. అయితే, ఈ దఫా కచ్చితంగా ఎన్నికల బరిలోకి దిగాలని ఆ పార్టీ తెలంగాణ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో పోటీ చేయరాదన్న అధ్యక్షుని అభిప్రాయాన్ని గౌరవించి పోటీకి పట్టుపట్టలేదని గుర్తు చేశారు. మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నామని, ఈసారి తప్పకుండా పోటీచేయవలసిందేనని తెలంగాణ జనసేన నేతలు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈసారికూడా ఎన్నికల బరినుంచి తప్పుకుంటే పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నవాళ్లం అవుతామని, ప్రజల ముందుకు భవిష్యత్తు లో బలంగా వెళ్లడం కష్టమవుతుందని, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని పవన్ దృష్టికి తెలంగాణ జనసేన నేతలు తీసుకెళ్లారు.
తెలంగాణ నేతల అభిప్రాయాలకు పవన్ స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్థం చేసుకోగలను. అయితే, తనమీద ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. నాయకులు, జనసైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని పవన్ అన్నారు. సరియైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని పవన్ తెలిపారు. అయితే, పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉన్నందున సానుకూల నిర్ణయం తీసుకోవాలని పవన్ కు తెలంగాణ జనసేన నేతలు విజ్ఞప్తి చేశారు.