జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత.. మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో ఎలక్షన్ స్వ్కాడ్ సోదాలు.. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ‌చార్జ్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయమే తాము సమాచారం ఇస్తే రాత్రిపూట సోదాలు చేయడంపై ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి విజయారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత.. మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో ఎలక్షన్ స్వ్కాడ్ సోదాలు.. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

Telangana Elections 2023

Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ -22లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఐఏఎస్‌ అధికారి ఏకె గోయల్‌ ఇంట్లో ఎలక్షన్స్‌ స్క్వాడ్‌, టాస్క్ఫోర్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకే గోయల్ ఇంట్లో భారీగా నగదు డంప్‌ అవుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌కు సమాచారం అందింది. దీంతో ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ నేతలు సమాచారం అందించారు. కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన సమాచారంతో మాజీ ఐఏఎస్‌ ఏకె గోయల్‌ ఇంటిపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోదాలు చేశారు.

Also Read : Telangana Polls: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్

2010లో రిటైర్‌మెంట్‌ తీసుకున్న తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఏకె గోయల్‌ సలహాదారుడిగా పనిచేశారు. అయితే సెర్చ్‌ ఆపరేషన్‌ జరగడంతో కాంగ్రెస్‌ నేతలు, మల్లు రవి, విజయారెడ్డి, అజారుద్దీన్‌ ఘటన స్థలానికి చేరుకున్నారు. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలూ అక్కడికి చేరుకున్నారు. ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

కాంగ్రెస్‌ నేతలు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఓ టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ విలువైన వస్తువులు తీసుకుని వెళ్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ బైక్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ‌చార్జ్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయమే తాము సమాచారం ఇస్తే రాత్రిపూట సోదాలు చేయడంపై ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి విజయారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన తమపైనే లాఠీచార్జ్‌ చేస్తారా అంటూ మల్లు రవి నిలదీశారు.