అందుకే కేంద్ర సర్కారుతో కలిసి పనిచేస్తా… మోదీని ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం: రేవంత్ రెడ్డి
పస్తాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరేమి అనుకున్నా తనకేం ఇబ్బంది లేదని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని పస్తాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
“మీ అందరూ అండగా నిలబడండి.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. నేను మళ్లీ ఒక్కసారి చెబుతున్నా.. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం.. నరేంద్ర మోదీని ఒక్కసారి కాదు 50 సార్లు అయినా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం.
తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే.. కలిసి మెలిసి పని చేసినప్పుడే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. కేంద్ర సర్కారు మీద అలిగి అప్పట్లో కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకుంటే ఏమైంది? ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు.
ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మా మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్లను గెలిపించుకోవడానికి నా శాయశక్తులా కష్టపడతా. నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా.
రోజులో 24 గంటలు కార్యకర్తలని కాపాడుకుని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత నాది. అదే సందర్భంలో నమ్మకంతో, విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.. పారదర్శకమైన పరిపాలనను అందించాలి.
ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి.. రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే ఐటీ, ఫార్మా ఇండస్ట్రీస్ తో పాటు ఇండస్ట్రియల్ పార్కులు రావాలి. పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చి రాష్ట్ర ఆదాయం పెరిగితే.. దాన్ని పేదలకు పంచాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇవన్నీ చేయాలంటే ప్రతిపక్షాలు సహా కేంద్ర ప్రభుత్వ సాంయం కూడా కావాలి” అని అన్నారు.
Also Read: బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా? ఆర్‌బీఐ కొత్త నిబంధనలను తెలుసుకోవాల్సిందే..
కాగా, “1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలను విద్యుత్ శాఖతో చేయించి, అదానీ, అంబానీతో మన ఆడబిడ్డలు పోటీపడి వ్యాపారం చేసేటట్లు అవకాశం ఇచ్చాం. ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలల అన్నీ కూడా ఆడబిడ్డలే నడిపించే విధంగా పాఠశాలల పెత్తనం ఇచ్చాం.
మా ప్రభుత్వంలో ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకుని, సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టాలనుకుంటున్నాం. ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని నిలబెడుతుంది.. ఆ కుటుంబం బాగుపడుతుంది.. ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు. కుటుంబ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలంటే ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మీ సోదరుడు మీ రేవంతన్న ఆడబిడ్డలకు మాట ఇస్తున్నాడు.. ఐదేళ్లలో కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే విధంగా వ్యాపారాలలో రాణించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం” అని చెప్పారు.