అధికార కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతోన్న స్థానిక పోరు.. జంపింగ్ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఆరా
పార్టీలో కూడా జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న గొడవలపై చర్చ నడుస్తోంది. పాత నేతల వర్గీయులకు 80 శాతం, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి 20 శాతం అవకాశాలు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Telangana Congress: తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి సర్వం సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రక్రియ కోసం ఇటు ప్రభుత్వం అటు ఎన్నికల కమిషన్ కసరత్తు స్పీడప్ చేసింది. అయితే స్థానిక పోరు అధికార పార్టీలో అలజడి రేపుతోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. కొత్త, పాత నేతల మధ్య నేతల మధ్య విభేదాలతో అధికార కాంగ్రెస్ సతమతమవుతోంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వర్గపోరు పీక్ లెవల్‌కు చేరుకుందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఓడిన నేతలకు..జంప్ అయిన ఎమ్మెల్యేలకు అస్సలు గిట్టడం లేదు. పైగా పాత, కొత్త కాంగ్రెస్ నేతల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల పోరు కొత్త పంచాయితీ పెడుతోందట. అభ్యర్థులను ఎవరు డిసైడ్ చేస్తారో..ఎవరికి టికెట్ ఇస్తారోనని కాంగ్రెస్ కార్యకర్తల్లో టెన్షన్ కొనసాగుతోందట.
Also Read: సర్కార్‌కే చిక్కులు తెస్తారా.. అంటూ ఈ ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారా?
పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఈ పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖైరతాబాద్, శేరిలింగంపల్లి మినహా మిగతా సెగ్మెంట్లలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కూడా బలంగా ఉన్నారు. ఇద్దరు నేతల బలం హస్తం పార్టీకి సమస్యగా మారిందని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పిన వారికే టికెట్లు వస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యేల వర్గం ప్రచారం చేసుకుంటోందట.
మొదటి నుంచి పార్టీలో ఉంటూ, గత ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీ చేసిన వారే అభ్యర్థుల ఎంపిక చేస్తారని ఇంకోవర్గం చెప్పుకుంటుందట. దీంతో మండల, గ్రామ స్థాయిలో కూడా తమ నేతనే అభ్యర్థులను ప్రకటిస్తారంటే తమ నేతనే డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటూ ఆధిపత్య పోరుకు కారణమవుతున్నట్లు హస్తం పార్టీలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో అటు పాత కాంగ్రెస్ నేతలు..ఇటు ఎమ్మెల్యేతో వచ్చిన నేతలు..ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉంటూ టికెట్ తనకే వస్తుందని చెప్పుకుంటున్నారట.
ఇలాగైతే బీఆర్ఎస్‌కు లబ్ధి?
ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య వర్గపోరుతో ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో స్థానిక ఎన్నికల రిజల్ట్ ఎలా ఉంటుందోనన్న టెన్షన్ కొనసాగుతోంది. కొత్త, పాతల పంచాయితీ మధ్య బీఆర్ఎస్‌కు లబ్ధి జరుగుతుందేమోనన్న డైలమాలో ఉన్నారట కాంగ్రెస్ పెద్దలు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గొడవలు ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షుల దగ్గరకు చేరాయి. ఇలాంటి గొడవలపై డీసీసీ అధ్యక్షులు కూడా సైలెంట్‌గా ఉంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు మద్దతు తెలిపినా, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన నేతకు మద్దతిచ్చినా ఇబ్బందులు తప్పవని ఆయా గొడవలను పీసీసీ చీఫ్, ఇంచార్జ్‌ల దృష్టికి తీసుకెళ్తున్నారట. మరోపక్క పీసీసీ చీఫ్ కూడా ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెడుతున్నారట. తమ వర్గానికి టికెట్ రాకపోతే రెబల్‌గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామని రెండు వర్గాల నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల వేళ రెండు వర్గాలను కాంప్రమైజ్ చేయడం కత్తమీద సాములాగా మారిందట. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నేత..పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే కలిసి పనిచేయకపోతే..స్థానిక ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అవుతామని లెక్కలు వేసుకుంటున్నారట కాంగ్రెస్ ముఖ్యనేతలు. ఇక ఈ ఎనిమిది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమని కాంగ్రెస్ నేతలు కలుపుకోవడం లేదని, తమ వర్గం వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలో కూడా జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న గొడవలపై చర్చ నడుస్తోంది. పాత నేతల వర్గీయులకు 80 శాతం, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి 20 శాతం అవకాశాలు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓకే చెప్తారా అన్నది పెద్ద సవాల్‌గా మారింది. ఎందుకంటే ఎమ్మెల్యే వెంట వచ్చిన వారికి టికెట్ ఇప్పించుకోకపోతే ఆయన వర్గమంతా దూరమయ్యే పరిస్థితి ఉంది. పోనీ ఎమ్మెల్యే వర్గానికి టికెట్ ఇస్తే పాత కాంగ్రెస్ నేతలు రెబల్‌గా నిలిచి ఓడిస్తామంటున్నారు. దీంతో ఈ పంచాయితీకి చెక్ పెట్టడం ఎలా.? స్థానిక గండం గట్టెక్కేదెలా అని తలల పట్టుకుంటున్నారట హస్తం పార్టీ లీడర్లు.