Telangana DGP: జీరో శాతం డ్రగ్స్ రాష్ట్రంగా నిలపడమే పోలీస్ శాఖ లక్ష్యం : డీజీపీ జితేందర్
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని డీజీపీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి.

Telangana DGP jitender
Telangana Crime Rate Report 2024: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.87శాతం కేసుల సంఖ్య పెరిగిందని, ఒకటి రెండు ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. తెలంగాణలో 2024 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ రేట్, లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్ నేరాలపై వార్షిక నివేదికను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం 2,34,158 కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.87శాతం కేసులు పెరిగాయని చెప్పారు. 85మంది నక్సల్స్ అరెస్ట్ కాగా, 41 మందిని సరెండర్ చేయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసులు నమోదు కాగా అందులో 4682 మందిని అరెస్ట్ చేశామని, 142.95 కోట్ల డ్రగ్స్ పట్టుకోవటం జరిగిందని, జీరో శాతం డ్రగ్స్ దిశగా పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుందని డీజీపీ తెలిపారు.
Also Read: Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయంలో బాలుడికి తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే?
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని డీజీపీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25,184 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా.. 180 కోట్లు వదిలిన ఫండ్స్ రీఫండ్ అయిపోతే, 247 కోట్లు విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. కొత్త చట్టాలు వచ్చిన తరువాత 85,190 కేసులు నమోదయ్యాయని, జీరో ఎఫ్ఐఆర్ కింద 1,313 కేసులు కొత్త చట్టాలు వచ్చిన తరువాత నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది 547 మంది ఎస్ఐలు, 12,338 మంది కానిస్టేబుల్స్ నియామకం జరిగింది. డయల్ 100 ద్వారా 16,92,173 కాల్స్ వచ్చినట్లు డీజీపీ తెలిపారు.
2024 సంవత్సరంలో 20,702 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు డీజీపీ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 11,64,645 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీజీపీ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని చెప్పారు. ఈ కేసులో సీబీఐకి లేఖ రాశామన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్నవారిని అమెరికా నుండి ఇండియాకు రప్పించే విషయంలో ఇంటర్నేషనల్ ప్రాసెస్ జరుగుతుందని, ఇప్పటికే ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటున్నామని, ప్రభాకర్ రావును హైదరాబాద్ కు తీసుకురావడానికి సమయం పడుతుందని డీజీపీ తెలిపారు.
పోలీసుల బలవన్మరణాలపై డీజీపీ జితేందర్ స్పందించారు.. ప్రతి ఏడాది ఏదో ఒక కారణంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు, ఫ్యామిలీ సమస్యలతోనూ పోలీసులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని జితేందర్ పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో పని ఒత్తిడి వల్ల కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని డీజీపీ తెలిపారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కేసు విషయంపై మీడియా ప్రశ్నించగా.. అల్లు అర్జున్ కేసు కోర్టు పరిధిలో ఉందని, ఆ కేసులో సమగ్ర విచారణ జరుగుతుందని డీజీపీ తెలిపారు.