బడ్జెట్ రూపకల్పనపై టీ.సర్కార్ కసరత్తు..శాఖల వారీగా లెక్కలు స్వీకరిస్తున్న అధికారులు

బడ్జెట్ రూపకల్పనపై టీ.సర్కార్ కసరత్తు..శాఖల వారీగా లెక్కలు స్వీకరిస్తున్న అధికారులు

Updated On : February 28, 2021 / 8:05 AM IST

telangana budget : బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో బడ్జెట్ రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. శాఖల వారీగా అధికారులతో భేటీ అవుతూ.. బడ్జెట్ లెక్కలను తీసుకుంటున్నారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా సర్కారు ఇప్పుడు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కుంటుండటంతో ప్రతీ పైసా లెక్కలోకి తీసుకుంటోంది.

గత ఏడాది కరోనా కారణంగా ప్రభుత్వాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. గత ఏడాది రాష్ట్ర బడ్జెట్ లక్షా 83 వేల కోట్లుగా అంచనా వేసుకున్నప్పటికీ.. కరోనా కారణంగా ఖజానాకు ఊహించనంతగా గండి పడింది. ఆ తర్వాత లాక్‌డౌన్ సడలింపుల వల్ల కొంత వరకైనా గల్లా పెట్టేలో కాసుల గలగల వినిపించింది. దీంతో ఈ సారి బడ్జెట్‌ కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఖర్చులు, వ్యయాలను లెక్కలేసుకుంటూ వాస్తవిక పరిస్థితులకు తగ్గట్లు బడ్జెట్‌ను సర్కార్ రెడీ చేస్తోంది.

కరోనా కారణంగా రాష్ట్రానికి రావాల్సిన పన్నులు, గ్రాంట్‌లలో భారీగా కోత పడింది. కేంద్రం నుంచి రావాల్సిన 18వేల కోట్ల పన్నుల వాటాలో 15వేల కోట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన 3 వేల కోట్లు రావాల్సి ఉంది. దీనితో పాటు మిగిలిన రంగాల్లో కూడా అనుకున్నంత సొమ్ము రాలేదు. కరోనాకు ముందు వరకు రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 16 నుంచి 17శాతం ఉండగా… ప్రస్తుతం అది 6.3 శాతానికి పడిపోయింది. దీంతో ఈసారి బడ్జెట్ రూపకల్పనపై స్వయంగా సీఎం కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆదాయం కోసం కేంద్రంపై ఎక్కువగా ఆధారపడకుండా.. సొంత రాబడి పెంచుకునేలా బడ్జెట్‌ను అధికారులు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం లిక్కర్, భూముల విలువను పెంచి రిజిస్ట్రేషన్ స్టాంప్‌ డ్యూటీని పెంచడం, ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా ఖజానాను నింపుకోవాలని భావిస్తోంది. మరి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు అమలులోకి వస్తే రాష్ట్ర గల్లాపెట్టే మళ్లీ నిండుకునే అవకాశం ఉంది.