Ration Card: రేషన్ కార్డుల పంపిణీ విషయంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కోటి కార్డులు.. వాటిపై ఉండే వివరాలు ఇవే..
రేషన్ కార్డుల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో కార్డులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ..

CM Revanth Reddy
Ration Card Details: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రేవంత్ సర్కార్ జనవరి 26న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారుల.. వాటిని పరిశీలించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. త్వరలో వారికి కొత్త కార్డులు ఇచ్చేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే, గ్రాడ్యూయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో కార్డుల పంపిణీ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రేషన్ కార్డుల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో కార్డులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న రేషన్ దరఖాస్తుల కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా.. మార్పులు, చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలోనూ కొత్తవి ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వచ్చే నెలలో కొత్తవి, పాతవి కలిపి దాదాపు కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా ఇచ్చే కార్డులను కలుపుకుంటే ఇవి కోటికి చేరుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
Also Read: Good News to Farmers: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రోత్సాహకాలు..
పాత రేషన్ కార్డుకు కొంచెం తక్కువలో, పోస్ట్ కార్డు సైజులో ఉండేలా కొత్త రేషన్ కార్డు డిజైన్ ను రూపొందిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపించారు. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో అనేక పథకాలు మహిళల పేరుపైనే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. రేషన్ కార్డులు కూడా వారి పేరుమీదనే ఇవ్వాలని సర్కార్ భావిస్తుందట. దీంతో త్వరలో పంపిణీ చేసే కొత్త రేషన్ కార్డులు ఇంటిలోని మహిళ పేరుతోనే జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
కొత్త రేషన్ కార్డులు మహిళ పేరుతో జారీ చేయడంతోపాటు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల్లో బార్ కోడ్ మిషన్లు పెట్టడం ద్వారా నేరుగా ఆన్ లైన్ లో బార్ కోడ్ స్కాన్ చేసి బయోమెట్రిక్ తో నెలనెలా బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ విధానం ద్వారా పారదర్శకత కూడా ఉంటుంది. దీంతో కొత్త రేషన్ కార్డులో బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ఉండనుంది. అడ్రస్ తో పాటు కార్డు ఏ రేషన్ షాపు పరిధిలో ఉందనే వివరాలు ఉండనున్నాయి. పోస్ట్ కార్డు సైజులో ఉంటే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలతో పాటు ప్రభుత్వ లోగో కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై కుటుంబం మొత్తం గ్రూప్ ఫొటో ఉండాలా..? లేదా..? అనే అంశంపై చర్చ జరుగుతుంది. అయితే, ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల్లో మార్పులు జరుగుతున్నందున ఫొటో లేకుండానే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది.