Telangana Govt: శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్.. ఇకనుంచి వారి కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం
ఈ ఏడాది జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

Telangana government
Telangana Govt: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో 44డిగ్రీలు దాటి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు వడగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని 588 మండలాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు మధ్యాహ్నం సమయాల్లో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్రంలో ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించేందుకు అవసరమైన చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.
Also Read: Vijayashanthi: క్యాబినెట్ రేసులోకి దూసుకొచ్చిన విజయశాంతి.. ఎలాగంటే?
ఈ ఏడాది జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న భారత వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 12శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో వడగాలుల పై ప్రణాళికను అధికారులతో కలిసి మంత్రి విడుదల చేశారు. రాష్ట్రంలో ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు అందించే పరిహారంను పెంచారు. వడదెబ్బతో మరణించిన వారికి ఎస్‌డీఆర్ఎఫ్(స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) కింద అపద్బంధు పేరుతో అందించే పరిహారం గతంలో రూ.50వేలు ఉండేది. అయితే, ప్రస్తుతం వడదెబ్బతో మృతిచెందిన వారి కుటుంబాలకు అందించే పరిహారాన్ని రూ.4లక్షలకు పెంచి ఇవ్వడం జరుగుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు.
Also Read: Madrasas Shut Down: యుద్ధ భయంతో ఉక్కిరిబిక్కిరి.. వెయ్యికి పైగా మదరసాలను ఖాళీ చేయించిన పాకిస్తాన్..
అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లో తాగునీటితోపాటు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేయాలని, సీఎస్ఆర్ నిధులతో వీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తెలంగాణలో 588 మండలాలను వడగాలుల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక కేంద్రాలు, ప్రార్థనా స్థలాలు వంటి చోట్ల అవసరమైన షెల్టర్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.