Telangana Govt : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొత్త రూల్.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే డబ్బులు రావు..
Telangana Govt : కొత్త విధానం ద్వారా.. ఆధార్ కార్డులో పేర్కొన్న పేరు, ఇంటి పేరులో ఏమైనా తప్పులు ఉంటే వేసవి సెలవుల్లోగా విద్యార్థులు సవరించుకుని 2026-27 ప్రవేశాలు ప్రారంభమయ్యే నాటికి దరఖాస్తుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.
fee reimbursement
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొత్త రూల్
- పది మెమో.. ఆధార్ లో పేరు సరిపోలాల్సిందే
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యారంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం.. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు విధానంలో మార్పులు చేయనుంది. ఈ నూతన విధానంతో ఇకనుంచి బోధన ఫీజులు, ఉపకార వేతనాలకు దరఖాస్తుచేసే విద్యార్థి పదో తరగతి మెమోలో ఉన్న పేరు, ఆధార్‌లోని పేరు, ఇంటి పేరు ఒకేలా ఉండాలి. ఇవి సరిపోలకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కోసం చేసుకున్న దరఖాస్తు ప్రాసెస్ చేయరు. అక్కడే ఆగిపోతుంది.
రాష్ట్రంలో బోధన ఫీజులకు ప్రతీయేటా 12లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి చెల్లించాల్సిన ఫీజు రూ.2,400 కోట్ల వరకు ఉంటోంది. అయితే, కొత్త విధానం ప్రకారం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే దాదాపు 20శాతం మంది ఆధార్‌లో పేరు సవరించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.
కొత్త విధానం ద్వారా.. ఆధార్ కార్డులో పేర్కొన్న పేరు, ఇంటి పేరులో ఏమైనా తప్పులు ఉంటే వేసవి సెలవుల్లోగా విద్యార్థులు సవరించుకుని 2026-27 ప్రవేశాలు ప్రారంభమయ్యే నాటికి దరఖాస్తుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనుసంధానం తప్పనిసరిగా ఉండాలని, ఆధార్ అనుసంధాన వ్యక్తిగత బ్యాంకు ఖాతా తప్పనిసరి అని అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకు ఖాతాలోని విద్యార్థి పేరు, ఆధార్ నంబర్‌ను సంక్షేమశాఖలు సాంకేతిక విధానంలో తనిఖీ చేసిన తరువాతే విద్యార్థికి ఉపకార వేతనం, బోధన ఫీజులు మంజూరవుతాయి.
దరఖాస్తు విధానం ఇలా..
♦ పదో తరగతి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, పదో తరగతి పూర్తి చేసిన సంవత్సరం వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి.
♦ ఈ వివరాలు సరిపోలితే దరఖాస్తు తెరుచుకుంటుంది. ఆ తరువాత లింగం, కులం, ఉపకులం, ఆధార్ నంబరు, విద్యార్థి మొబైల్ నవంబరు, యూనివర్శిటీ, జిల్లా, మండలం, కళాశాల పేరు నమోదు చేయాలి.
♦ ఆధార్ లో పేరు, పదో తరగతి మెమోలో పేరు సరిపోలితేనే దరఖాస్తు ఇక్కడి నుండి ముందుకు వెళ్తుంది. వెంటనే దరఖాస్తు ఐడీ వస్తుంది. దీంతో ఉపకార వేతన దరఖాస్తు తొలి విడత పూర్తవుతుంది.
♦ రెన్యువల్ విధ్యార్థులకూ ఆధార్, పదో తరగతి పేరు సరిపోలాల్సిందే.
♦ తొలి విడత దరఖాస్తు పూర్తయిన తరువాత మీ సేవ కేంద్రాల్లో ఆధార్ అంథెటిఫికేషన్ పూర్తి చేయాలి. ఆ తరువాత దరఖాస్తులో వివరాలు పూర్తి చేసిన ఆన్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది.
