కోర్టు ఆదేశాలతో లోకల్ బాడీ పోల్స్‌పై సర్కార్ కసరత్తు.. ఎన్నికలకు రెడీ అవుతూనే.. 42 శాతం రిజర్వేషన్లపై ఫోకస్
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టేలా చేయాలనే ఆలోచన మరొకటి.

తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల అంశం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ విపక్షాలకు ప్రధాన ప్రచార అస్త్రంగా ఉంటుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది హస్తం పార్టీ. ఆ మాటను నిలబెట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అందుకోసం లోకల్ బాడీస్‌లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం శాసనసభలో ఆమోదం తెలిపిన బీసీ బిల్లును గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉంది.
లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచడానికి కొన్ని అడ్డంకులున్నాయి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. కానీ సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50శాతం లిమిట్ మించడానికి వీళ్లేదని తీర్పు ఇవ్వడంతో..రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 23 శాతానికి పడిపోయాయి. అయితే ఎన్నికల హామీ ప్రకారం 42 శాతానికి రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కులగణన చేసిన నేపథ్యంలో..డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై కూడా క్యాబినెట్‌లో చర్చించారు. అయితే న్యాయపరమైన చిక్కులు రాకూడదంటే పాత విధానాన్నే ఫాలో కావాలని డెడికేషన్ కమిషన్ సూచించింది. కానీ క్యాబినెట్ మాత్రం దాన్ని అంగీకరించలేదు. పాత విధానం కాకుండా కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటోంది. అందుకోసం ప్రభుత్వం న్యాయనిపుణుల సలహా తీసుకోగా..రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని సూచించినట్లు తెలుస్తోంది.
3 నెలల్లో చట్టం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచన
అయితే ఈ మధ్య తమిళనాడు ప్రభుత్వంకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వం చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడంతో.. మూడు నెలల్లో చట్టం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతికి బిల్లు పంపి జూలై 10తో మూడు నెలల గడువు ముగుస్తోంది. జూలై 10 తర్వాత సేమ్ తమిళనాడు ప్రభుత్వంలాగే జీవోలు జారీ చేసి చట్టం చేయాలనే ఆలోచనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.
వచ్చే నెలలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా అనుకుంటున్నారట. లోక్‌సభలో విపక్ష పక్షనేత రాహుల్ గాంధీ చేత పెద్దఎత్తున ఆందోళనలు చేసి బీసీ రిజర్వేషన్లు సాధించాలని ఆలోచన చేస్తోంది. ఎలాగైనా రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్‌లో పెట్టించాలని భావిస్తోంది.
తమిళనాడు మాదిరిగా తొమ్మిదవ షెడ్యూల్‌లో పెడితే..న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడొచ్చనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే జూలై 10 తర్వాత జీవో విడుదల చేసి చట్టం చేయాలనేది ఒకటి. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టేలా చేయాలనే ఆలోచన మరొకటి. మరి కాంగ్రెస్ ప్రభుత్వ పట్టుదల నెరవేరుతుందా లేదా అనేది చూడాలి.