Rythu Bharosa: ‘రైతు భరోసా’ డబ్బులు మీ అకౌంట్లలో ఇంకా పడలేదా..? నో టెన్షన్.. ఇలా చేస్తే డబ్బులొచ్చేస్తాయ్..

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతీయేటా ఎకరాకు రూ.12వేలను రెండు దఫాలుగా అందజేస్తుంది.

Rythu Bharosa: ‘రైతు భరోసా’ డబ్బులు మీ అకౌంట్లలో ఇంకా పడలేదా..? నో టెన్షన్.. ఇలా చేస్తే డబ్బులొచ్చేస్తాయ్..

Rythu Bharosa Scheme

Updated On : June 19, 2025 / 11:14 AM IST

Telangana Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలలో భాగంగా ‘రైతు భరోసా’ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం విడుదల చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో వానాకాలం సీజన్ కు సంబంధించి న నిధుల విడుదలను ప్రారంభించారు.

 

నాలుగెకరాల రైతులకు పూర్తి..
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతీయేటా ఎకరాకు రూ.12వేలను రెండు దఫాలుగా (ఖరీఫ్, రబీ సీజన్లకు) రూ.6వేల చొప్పున అందిస్తుంది. ఈ యేడాది వానాకాలం సీజన్‌లో భాగంగా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున జమ చేస్తుంది. బుధవారం వరకు రైతు భరోసా పథకం కింద నాలుగు ఎకరాల వరకు కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం రూ.5,215.26 కోట్లను విడుదల చేయడం జరిగిందని, 58.4లక్షల మంది రైతులకు సాయం అందించినట్లు మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

డబ్బులు పడకుంటే ఇలా చేయండి..
ఎకరాలతో సంఖ్యతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సాయం అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, నాలుగు ఎకరాలు భూమి కలిగిన కొందరు రైతులకు ఇంకా అకౌంట్లలో డబ్బులు పడకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లోని రైతులకు రైతు భరోసా నిధులు జమ కాలేదని పేర్కొంటూ బీఆర్ఎస్ నేతలు సబిత ఇంద్రారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డితోపాటు పలువురు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఇలా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని అర్హులైన రైతులకు డబ్బులు జమ కాలేదని తెలుస్తోంది. రైతు భరోసా నిధులు జమకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉండి.. బ్యాంకు అంకౌట్లలో డబ్బులు పడని రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

వారికి కూడా ఛాన్స్ ఉంది..
మరోవైపు.. రాష్ట్రంలో కొత్తగా భూముల యాజమాన్యం పొందిన రైతులకు కూడా రైతు భరోసాకు అర్హులవుతారని ప్రభుత్వం తెలిపిన విషయం విధితమే. జూన్ 5వ తేదీ వరకు భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన తేదీ (జూన్ 20వ తేదీ) వరకు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలని భావించిన వారు సంబంధిత ఏఈవో దగ్గరకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 20వ తేదీ వరకు అలా అప్లయ్ చేసుకున్న వారికి మాత్రమే రైతు భరోసా సాయం అందుతుందని అధికారులు తెలిపారు.