Telangana Medical Colleges : తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీలు
సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Telangana Govt Decide To Build Medical Colleges In Mahabubabad
Telangana Medical Colleges : సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్ కాలేజీలు లేని చోట్ల వాటిని మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు త్వరితగతిన మందులు అందించడం కోసం కొత్తగా 12 రీజినల్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు సీఎం కేసీఆర్.
సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్, గద్వాల కేంద్రాల్లో మందులు తదితర మౌలిక వసతుల రీజినల్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సింగరేణి, ఆర్టీసీ, CISF, CRPF, రైల్వే, ఆర్మీ, ESI సహా అందుబాటులో ఉన్న అన్ని ఆస్పత్రులను కోవిడ్ సేవలు అందించడానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ బెడ్లు కేటాయించే విషయంతోపాటు, నిర్ణీత ధరలను నిర్ణయిస్తూ 11 నెలల క్రితమే ప్రభుత్వం 248 జీవోను విడుదల చేసిందన్నారు సీఎం కేసీఆర్. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఇదే తరహా నిబంధనలను అమలు చేస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.