Telangana Govt : విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్.. మెనూ ఇదే..!
Telangana Govt : తెలంగాణ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేసేందుకు సిద్ధమైంది. మెనూ రెడీ అయింది.

Telangana Govt
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై విద్యాశాఖ అధికారులకు సూచనలు చేశారు. దీంతో ఈ స్కీమ్ అమలుపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లో అందించే టిఫిన్స్ లిస్ట్‌ను సైతం రెడీ చేశారు.
రాష్ట్రంలో 24,277 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 18లక్షల మంది చదువుతున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంతోపాటు రాగిజావా అందిస్తున్నారు. అయితే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు రాష్ట్రం తరహాలో విద్యార్థులకు ఉదయాన్నే టిఫిన్ కూడా అందించేలా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇటీవల తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు ప్రభతు్వం తరహాలో తెలంగాణలోనూ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేస్తామని ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు వచ్చే ఏడాది నుంచి బ్రేక్ ఫాస్ట్ పథకం అమలుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు రోజుకు ఒక్కొక్కరికి రూ.8, హైస్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.11 చొప్పున ఖర్చు చేయాలని ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. అధికారుల లెక్కల ప్రకారం.. ఈ పథకం కోసం ప్రతీ సంవత్సరం రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
నోరూరించేలా మెనూ..
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటినుంచి బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఈ పథకం కింద ఉదయం వేళ విద్యార్థులకు అందించే టిఫిన్స్ వివరాలనూ అధికారులు మెనూను సిద్ధం చేశారు. మూడు రోజులు రైస్ ఐటెమ్స్ (పొంగల్, కిచిడీ, జీరారైస్), రెండు రోజులు రవ్వ ఐటెమ్స్ (గోధుమరవ్వ, బొంబాయి రవ్వ ఉప్మా) ఇవ్వాలని నిర్ణయించారు. మరోరోజు బోండా ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఏజెన్సీలకు బాధ్యతలు..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అమలు చేయబోయే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ బాధ్యతను ఏజెన్సీలు లేదా ఎన్జీవోలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఎన్జీవోలు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాయి. వాళ్లు ముందుకొస్తే ఆ ప్రాంతంలో వారికే బాధ్యతలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్జీవోలు ముందుకురాని చోట ప్రస్తుతం ఉన్న మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు అప్పగించనున్నారు. దీనికి గాను అదనపు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.