Telangana : తెలంగాణలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
Telangana గురువారం సాయంత్రం వరకు మొంథా తుపాను ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ఇవాళ పలు జిల్లాల్లో కుండపోత వర్షాలుకురుస్తాయని ..
Telangana
Telangana : మొంథా తుపాను మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఏపీలో తీరం దాటిన తరువాత దిశమార్చుకొని తెలంగాణపై విరుచుకుపడింది. దీంతో బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది.
గురువారం సాయంత్రం వరకు మొంథా తుపాను ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ఇవాళ పలు జిల్లాల్లో కుండపోత వర్షాలుకురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది.
బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలో అత్యధికంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో 34.8 సెం.మీ వర్షం కురిసింది. ఇవాళ (గురువారం) మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు.. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. సిద్ధిపేట, కరీంనగర్, యాదాద్రి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాల్లో ఇవాళ పాఠశాలలకు సెలవు ఇచ్చారు.
