Gali Janardhan Reddy : 53 కిలోల బంగారం తుప్పుపట్టిపోతుంది.. తిరిగి అప్పగించండి.. గాలి జనార్థన్ రెడ్డి పిటిషన్.. షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు!

Gali Janardhan Reddy : ఓబులాపురం మైనింగ్ కేసులో భాగంగా సీజ్‌ చేసిన 53 కిలోల బంగారు నగలు, రూ. 5 కోట్ల విలువైన బాండ్లను తిరిగి అప్పగించాల్సిందిగా కోరుతూ గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

Gali Janardhan Reddy : 53 కిలోల బంగారం తుప్పుపట్టిపోతుంది.. తిరిగి అప్పగించండి.. గాలి జనార్థన్ రెడ్డి పిటిషన్.. షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు!

Gali Janardhan Reddy

Updated On : March 14, 2025 / 11:53 AM IST

Gali Janardhan Reddy : అక్రమ మైనింగ్ కేసులో మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనతో పాటు కుమారుడు కిరీట్ రెడ్డి, కూతురు బ్రాహ్మణి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారం, రూ. 5 కోట్ల విలువైన బాండ్ల విడుదల కోరుతూ ముగ్గురు మూడు పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే, దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కె. లక్ష్మణ్ తోసిపుచ్చారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లోని బాండ్లు, బంగారు నగలను తిరిగి తమకు అప్పగించేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ ఆస్తులు నేరం ద్వారా వచ్చిన ఆదాయంలో భాగం కాదని గాలి జనార్థన్ రెడ్డి కుటుంబం వాదించింది. అయితే, ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు కొట్టివేసింది.

Read Also : Holi 2025 : హోలీ పండుగ ఎఫెక్ట్.. రైల్వే శాఖ కొత్త రూల్స్.. ఈ స్టేషన్లలో ప్లాట్‌‌ఫారం టికెట్లపై నిషేధం.. ఓసారి చెక్ చేసుకోండి!

ఈ సందర్భంగా విచారణ ముగిసేలోపు స్వాధీనం చేసుకున్న బంగారం, బాండ్లను అప్పగించాలంటూ సీబీఐని ఆదేశించలేమని హైకోర్టు పేర్కొంది. బళ్లారిలోని గాలి జనార్ధన్ రెడ్డి నివాసంలో సెప్టెంబర్ 5, 2011న సీబీఐ దాడులు జరిపింది. ఈ కేసులో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 53 కిలోల బంగారం, దాదాపు రూ.3 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి బ్రాహ్మణి కంపెనీ షేర్లతో సహా రూ.885 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. 2006లో మైనర్ పిల్లల పేర్లతో తీసుకున్న ఈ బాండ్లు 2012లో మెచ్యూరిటీ చెందాయి.

అయితే, జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు చెందిన నేరాల ద్వారా వచ్చిన ఆదాయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ రెండూ ఈ ఆస్తులను కస్టడీకి కోరుతున్నాయని హైకోర్టు పేర్కొంది.

Read Also : Weather Update : బాబోయ్.. దంచికొడుతున్న ఎండలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఈ రెండు రోజులు బయటకు రావొద్దు..!

తన కుమార్తె వివాహానికి 105 ఆభరణాల రూపంలో నిల్వ చేసిన బంగారం అవసరమని గాలి జనార్దన్ రెడ్డి వాదించారు. సీబీఐ కస్టడీలో బంగారం తుప్పు పట్టడం ఖాయమని, తమకు తాత్కాలిక కస్టడీని కావాలని అభ్యర్థించారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని కోర్టు పేర్కొంది.

ఎందుకంటే.. ముందుగా నిందితుడి నేరాన్ని ట్రయల్ కోర్టులో నిర్ధారించాలి. తుది తీర్పు ఆధారంగా పిటిషనర్లు ట్రయల్ కోర్టు ముందు ఇలాంటి అభ్యర్థనలను దాఖలు చేయవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. సీబీఐ కోర్టులోనే పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించింది.