ఇక నుంచి కొత్త చరిత్ర : యాదాద్రి శిలలపై తెలంగాణ వైభవం

  • Published By: chvmurthy ,Published On : September 6, 2019 / 10:24 AM IST
ఇక నుంచి కొత్త చరిత్ర : యాదాద్రి శిలలపై తెలంగాణ వైభవం

Updated On : September 6, 2019 / 10:24 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యాదాద్రి ఆలయ పునర్నిమాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరికొన్నిరోజుల్లోనే యాదాద్రిలో అద్భుతం చూడబోతున్నాం. ఆలయ పునర్నిర్మాణంతో పాటు ఆధునిక తెలంగాణ చరిత్ర కూడా రూపుదిద్దుకుంటోంది. భవిష్యత్ తరాలకు నేటితరం ఆనవాళ్లను మిగల్చడంతోపాటు మరో వెయ్యేళ్లు చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రిలో పనులు జరుగుతున్నాయి. యాదాద్రి ఆలయ ప్రాకార మండపంలోని రాతి స్తంభాలపై మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీతో పాటు సీఎం కేసీఆర్ చిత్రాలను చెక్కారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తోన్న తెలంగాణ ప్రభుత్వ పథకాలైన హరితహారం, కేసీఆర్ కిట్‌ను ప్రతిబింబించే చిత్రాలతో పాటు తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం, చార్మినార్‌, టీఆర్ఎస్ కారు గుర్తును రాతి స్తంభాలపై పొందుపరిచారు.

వీటితో పాటు రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, జాతీయ పక్షి నెమలిని కూడా చెక్కారు. ఉద్యమ నేపథ్య చిత్రాలన్నీ అష్టభుజి ప్రాకార మండపంలో నిక్షిప్తం చేశారు. ప్రస్తుతం చలామణీలో లేని పైసా, 2, 3, 5, 10, 20 పైసల నాణేల గుర్తులను కూడా చెక్కారు. బతుకమ్మ, నాగలి దున్నే రైతు బొమ్మలతో పాటు క్రికెట్, హాకీ చిత్రాలను కూడా స్తంభాలపై పొందపరిచారు. నేటి సంప్రదాయాలు, సంస్కృతితో పాటు ఆధ్యాత్మిక, పురాణ, ఇతిహాసాలను.. యాదాద్రి ఆలయంలోని శిలలపై శాసనాలుగా చెక్కుతున్నారు. తెలంగాణ ప్రజల జీవనవిధానం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునిక తెలంగాణ చరిత్రను రాతి స్తంభాలపై నిక్షిప్తం చేయాలని, భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారని ఆలయ  శిల్పులు చెబుతున్నారు.

తొలిసారి.. పాదం నుంచి శిఖరం వరకు కృష్ణశిలతో గుడి రూపుదిద్దుకుంటోంది. రాజుల కాలంనాటి నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకుని.. యాదాద్రి పునర్నిర్మాణం జరుగుతోంది.