CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్.. బీఆర్ఎస్‌పై సెటైర్లు
బీఆర్ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆగ్రహంవ్యక్తం చేశారు.

CM Revanth Reddy
CM Revanth Reddy : అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజు (ఆదివారం) బీసీలకు 42శాతం రిజర్వేషన్లుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అన్నారు. ఆరునూరైనా చెప్పింది చేయాలని నిర్ణయించుకున్నామని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని అన్నారు. బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్ ను వేశామని రేవంత్ చెప్పారు.
బీఆర్ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణమే చిత్తశుద్దితో రిజర్వేషన్ల హామీ నిలబెట్టుకున్నాం. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని అన్నారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని, కేసీఆర్ తెచ్చిన 50శాతం రిజర్వేషన్లు పరిమితిని తొలగిస్తామని అన్నారు.
సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు డెడ్‌లైన్ పెట్టింది. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన చట్టం.. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు పెంచడానికి గుదిబండగా మారిందంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రధానమంత్రిని కలిసేందుకు ఐదు సార్లు లేఖరాస్తే.. అపాయింట్ మెంట్ ఇవ్వలేదని రేవంత్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే.. మేము జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే బీఆర్ఎస్ ఎందుకు అటెండ్ కాలేదంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
గతంలో బీఆర్ఎస్ తెచ్చిన రెండు చట్టాలు గుదిబండగా మారాయి.. అడ్డంకులు తొలగించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కు పంపించాం. కానీ, తెరవెనుక లాబీయింగ్ చేసి బిల్లును రాష్ట్రపతికి పంపించేలా చేశారంటూ రేవంత్ అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవాలని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశాం.. కానీ, బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం స్పందించలేదు.. దాన్నిబట్టి వాళ్లకు బీసీల రిజర్వేషన్ల అంశంపై ఏమాత్రం చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందని రేవంత్ అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై గంగుల కమలాకర్ సంతోషంగా ఉన్నారు.. కానీ, బీఆర్ఎస్ లోనే అగ్రనేతలు బాధతో ఉన్నారు. కేటీఆర్, హరీశ్ గురించి గంగులకు తెలియంది కాదు. కల్వకుంట్ల కాదు.. కలవకుండా చేసే కుటుంబం అది అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సభకురారు.. వచ్చినవారు ఇలా ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు. మీరు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు.. ఆరోపణలు చేయకుండా సూచనలు చేయండి అంటూ రేవంత్ రెడ్డి సూచించారు. బీసీ రిజర్వేషన్లకు మేము సహకరించం.. మా బుద్ది మారదు అంటే ప్రజలే సమాధానం చెబుతారంటూ హెచ్చరించారు.