Telangan Assembly : రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం.. సభ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక.. భారీగా మార్షల్స్ మోహరింపు
Telangan Assembly : రెండోరోజు ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ లోపల, బయట భారీగా మార్షల్స్ మోహరించారు.

Telangana Assembly
Telangan Assembly : రెండోరోజు ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సభలో కాళేశ్వరం కమిషన్ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. సభలో కమిషన్ నివేదికపై చర్చించాలని సర్కార్ నిర్ణయించింది. మరోవైపు.. సభ లోపల, బయట భారీగా మార్షల్స్ మోహరించారు. అర్ధరాత్రి వరకు అయినా సభ నడిపించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్ డ్రైవ్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అందజేశారు. దీంతో పాటు పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్లాబ్లిష్ మెంట్స్ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సభ జరుగుతున్నప్పుడు ఆర్డినెన్సులు చెల్లవు.. అందుకే బిల్లు తెచ్చామని అన్నారు. ఇది తెలిసి కూడా హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి మాట్లాడడం సరికాదని అన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, బలహీన వర్గాలకు స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని, బీసీ రిజర్వేషన్లకు సభ్యులంతా సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు. పురపాలక చట్టం 2019 నిబంధనలపై చర్చిస్తున్నామని తెలిపారు.
మంత్రులు Vs గంగుల కమలాకర్ ..
బీసీ రిజర్వేషన్ బిల్లును సభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను బీఆర్ఎస్ సభ్యులు స్వాగతించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలని పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. బీసీ బిల్లును బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతించిందని గంగుల తెలిపారు. అయితే, రిజర్వేషన్లను శాస్త్రీయంగా చేసిన తమిళనాడు సక్సెస్ సాధించిందని, అశాస్త్రీయంగా చేసిన బీహార్, మధ్యప్రదేశ్ సక్సెస్ సాధించలేదని అన్నారు. సవరణలు పక్కాగా చేపట్టాలని, హడావుడిగా బిల్లు తెస్తే కోర్టులో వీగిపోతుందని గంగుల అన్నారు. మంత్రి పొన్నంకు వాస్తవాలు తెలియవు.. బీసీ కమిషన్ పై ఆయనకు అవగాహన లేదని గంగుల అన్నారు. దీంతో గంగుల వ్యాఖ్యలపై మంత్రి పొన్నం సీరియస్ అయ్యారు. గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్న మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బిల్లు వద్దని అవరోధం కలిగిస్తామంటే చెప్పండి.. ఓ మంత్రికి ఏమీ తెలియదని గంగుల అనడం సరికాదని శ్రీధర్ బాబు అన్నారు.