తెలంగాణ నయాగరా… బొగత జలపాతానికి జలకళ

  • Published By: bheemraj ,Published On : August 16, 2020 / 09:16 PM IST
తెలంగాణ నయాగరా… బొగత జలపాతానికి జలకళ

Updated On : August 17, 2020 / 10:49 AM IST

ములుగు జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. వాజేడు మండలంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతానికి జలకళ సంతరించుకుంది. ఏటూరునాగారం సమీపంలోని కొండ కోనల్లో బొగత జలపాతం పాలధారలను తలపిస్తూ ఎగిసిపడుతోంది. పర్యాటకులకు కనువిందు చేస్తోంది.



బొగత జలపాతం.. దీనికి తెలంగాణ ‘నయాగరా’గా గుర్తింపు. ఇది ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఉంది. బొగత జలపాతం భద్రాచలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 329 కిలోమీటర్ల దూరంలో ఉంది. బొగత జలపాతం వద్దనే నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉంది. ప్రతి అదివారం అక్కడికి వందలాదిమంది భక్తులు వెళ్తుంటారు.



మామూలు రోజుల్లో విహారయాత్రికుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నా సెలవుదినాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. వివిధ దేవుళ్ల మాలలు ధరించిన భక్తులు ఈ నరసింహస్వామి సన్నిధిలోనే పూజలు చేసుకుంటారు. మహిమగల దేవుడిగా ఈ నరసింహస్వామి ప్రసిద్ధి. స్థానికుల కొంగు బంగారంగా కీర్తి గడించాడు.



ఆలయం..ఆ ప్రాంత ప్రజల పిక్నిక్ స్పాట్‌గా కూడా గుర్తింపు పొందింది. స్కూల్ విద్యార్థులు, ఉద్యోగుల నుంచి అధికారులు సైతం ఈ బొగత జలపాతాన్ని సందర్శించడానికి, నరసింహస్వామిని దర్శించుకోవడానికి క్యూ కడుతుంటారు. రోజంతా గడిపి పరవశించి పోతుంటారు.