Telangana MLC elections: గెలిచి తీరాల్సిందేనని కాంగ్రెస్ ప్రయత్నాలు.. గట్టి పోటీ ఇస్తున్న ప్రత్యర్థులు వీరే..
బీసీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ.. కాంగ్రెస్ అలర్ట్ అయింది.

విజయం ఈజీ అనుకున్నారక్కడ.. కట్ చేస్తే మూడు వారాల్లో మారిపోయింది సీన్ ! దీంతో అధికార పార్టీ అలర్ట్ అయింది. బలం చూపిస్తోంది. బలగాన్ని దింపేస్తోంది. ఆ ఒక్క స్థానంపై కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు.. భారీ ఫైటింగ్ చేస్తోంది.
గెలుపు ఒక్కటే ఆప్షన్ అన్నట్లుగా.. సీఎం సహా కీలక నేతలంతా ఇప్పుడు అక్కడే కనిపిస్తున్నారు. ఇంతకీ కాంగ్రెస్‌కు ఆ స్థానం ఎందుకు అంత ప్రతిష్టాత్మకం.. ఈజీగా గెలుస్తామనుకునే ప్లేస్‌లో ఇంత యుద్ధం ఎందుకు.. పరిస్థితులు ఎలా మారాయ్.. ఎందుకు మారాయ్.
తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయ్. పట్టభద్రుల ఎన్నికను.. అధికార కాంగ్రెస్ చాలా సీరియస్‌గా తీసుకుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌కు సంబంధించిన గ్రాడ్యుయేట్ సీటులో ప్రస్తుతం కాంగ్రెస్ సిట్టింగ్‌లో ఉంది. సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఈ స్థానం నుంచి విజయం సాధించారు.
Also Read: అలా వచ్చి ఇలా వెళ్లిన జగన్.. స్ట్రాటజీ ఏంటి?
ప్రస్తుతం ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ ఈజీగా విజయం సాధిస్తుందని ముందుగా అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని సర్వేలు చెప్తున్నాయ్. దీంతో హస్తం పార్టీ అధిష్టానం.. ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని తీరాలని పట్టుదలతో ఉంది. దీనికోసం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగుతున్నారంటే.. అర్థం చేసుకోవచ్చు సీన్ ఎంత సీరియస్ అని!
ఇతర పార్టీల ప్రయత్నాలు
బీజేపీ తగ్గేదే లే అంటోంది.. బీఎస్పీ బీసీ నినాదం ఎత్తుకుంది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కూడా సై అంటున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంలో బహుముఖ పోటీ కనిపిస్తోంది. దీంతో సీన్ మరింత ఇంట్రస్టింగ్ మారింది. ఇక్కడ బీజేపీ నుంచి అంజిరెడ్డి.. బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణతో పాటు.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి రవీందర్ సింగ్ పోటీలో ఉన్నారు. అన్ని పార్టీలు ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయ్.
దీంతో నువ్వా నేనా అన్నట్లు యుద్ధం కనిపిస్తోంది. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ఈ స్థానం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలో ఉండి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే.. జనాల్లోకి తప్పుడు సమాచారం వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ చాలా సీరియస్‌గా తీసుకుంది. 55వేల ఉద్యోగాలు ఇచ్చామని.. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ఐటీఐలను అప్‌గ్రేడ్ చేశామనే అంశాలను ప్రస్తావిస్తూ.. విద్యావంతులు, నిరుద్యోగుల సపోర్టు తమకే అని కాంగ్రెస్ భావించింది. ఈజీగా విజయం సాధిస్తామని లెక్కలేసుకుంది. ఐతే లోకల్ రిపోర్టులు మాత్రం భిన్నంగా ఉన్నాయట. దీంతో సీఎం రేవంత్ స్వయంగా బరిలోకి దిగినట్లు తెలుస్తోంది.
బాధ్యతల అప్పగింత
నరేందర్ రెడ్డి గెలుపును.. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. వ్యూహ ప్రతివ్యూహాల విషయంలో పార్టీ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్‌గా ఉన్నారు. జూమ్ ద్వారా పార్టీ నిత్యం సమీక్ష జరుపుతూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
సీఎం రేవంత్‌తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి.. బీజేపీ, బీఎస్పీతో పాటు.. ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్ గట్టి పోటీ కనిపిస్తోంది. బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు.. రెడ్డి సామాజికవర్గానికి పెద్ద పీట వేశాయని… బీసీ బిడ్డగా తనను గెలిపించాలంటూ ప్రసన్న హరికృష్ణ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
బీసీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ.. కాంగ్రెస్ అలర్ట్ అయింది. దీంతో బీసీల కోసం ఏం చేశాం.. ఏం చేస్తున్నాం.. ఏం చేయబోతున్నామనే విషయాలను సీఎం స్వయంగా వివరిస్తున్నారు. కులగణన సర్వేతో పాటు.. బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత విషయంలో చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తున్నారు.
సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికోసం పీసీసీ అధినేత సహా రాష్ట్ర మంత్రులంతా 15జిల్లాల పరిధిలో ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే.. నిరుద్యోగులు, ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ హామీలిస్తున్నారు. ఒకవైపు నిరుద్యోగులను తమ వైపు తిప్పుకోవడంతో పాటు.. బీసీలను మచ్చిక చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఫైట్ మరింత ఇంట్రస్టింగ్ మారింది.