Telangana: శివరాత్రికి ఆ దేవాలయాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు రెడీ.. పూర్తి వివరాలు ఇలా..

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ఆలయాలకు..

Telangana: శివరాత్రికి ఆ దేవాలయాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు రెడీ.. పూర్తి వివరాలు ఇలా..

TGSRTC Special buses

Updated On : February 23, 2025 / 11:00 AM IST

TGSRTC: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ మహానగరంతో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రజలు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు వెళ్తుంటారు. ఈ సందర్భంగా రవాణా కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3వేల ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈనెల 26న మహాశివరాత్రి పర్వదినంకాగా.. ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను టీజీఎస్ ఆర్టీసీ నడపనుంది.

Also Read: Maha Shivratri 2025 : మహాశివరాత్రి రోజున ఉపవాసం నియమాలేంటి? ఎలా చేయాలి? ఏమి తినాలి? ఏమి తినకూడదంటే?

శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతో పాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులను టీజీఎస్ ఆర్టీసీ నడపనుంది. హైదరాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బి, బీహెచ్ఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పలు సౌకర్యాలను సంస్థ కల్పిస్తుంది.

 

శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 50శాతం వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్ లలో టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నెల 24 నుంచి 27 తేది వరకు నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 26 నుంచి 28 తేది వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణీకులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేయనుంది.

Also Read: Maha Shivratri 2025 : మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా ఈ పువ్వుతో శివలింగాన్ని పూజించకూడదు.. ఎందుకంటే?

పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్లు సదుపాయాన్ని కల్పించడం జరిగింది. టికెట్లు బుకింగ్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో చేసుకోవచ్చునని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. అదేవిధంగా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం టీజీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

 

గత శివరాత్రి కన్నాఈసారి 809 బస్సులను అదనంగా టీజీఎస్ ఆర్టీసీ నడుపుతుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణించి శైవాలయాలకు చేరుకొని భక్తులు మొక్కులు చెల్లించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ వీసీ సజ్జనార్ కోరారు.