Prashant Kishore : టీఆర్ఎస్కు రాజకీయ వ్యూహకర్త మారబోతున్నారా ?
ఈ సయమంలో.. ఆయన సేవలు వాడుకునే విషయంలో గులాబీ బాస్ సందిగ్ధంలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్‌కు ప్రత్యామ్నాయాలు గురించి ఆలోచిస్తున్నారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.

Trs
Prashant Kishore : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఇప్పుడు టీఆర్ఎస్లో హాట్ టాపిక్‌గా మారింది. పీకే కాంగ్రెస్‌లో చేరి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ప్రచారం జరుగుతోంది. ఈ సయమంలో.. ఆయన సేవలు వాడుకునే విషయంలో గులాబీ బాస్ సందిగ్ధంలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్‌కు ప్రత్యామ్నాయాలు గురించి ఆలోచిస్తున్నారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. పీకే కాంగ్రెస్‌లో చేరినా.. ఆయన టీమ్ టీఆర్ఎస్కు పనిచేస్తుందా.. లేక గులాబీ బాస్ మరో వ్యూహకర్తను నియమించుకుంటారా.. అన్న అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి.
తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్.. ఇందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారు. దీనిలో భాగంగా… వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు రాజకీయ వ్యూహాకర్త పీకే పని చేస్తున్నారని కేసీఆర్ గతంలో ప్రకటించారు. కానీ మారుతున్న రాజకీయ సమీకరణల్లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కోసం పని చేయనున్నారని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. పీకేతో పాటు ఆయన టీమ్ ఇప్పటికే తెలంగాణలో పర్యటించింది.
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో పీకే భేటీ అవ్వడంతో పాటు గులాబీ బాస్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించి.. అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఆయన టీమ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి.. ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ సమయంలో పీకే కాంగ్రెస్‌లో చేరితే.. టీఆరెస్‌కు రాజకీయ వ్యూహకర్తగా ఎవరు పని చేస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది.
తన టీమ్‌లోని కొందరు టీఆర్ఎస్ కోసం పని చేస్తారని ప్రశాంత్ కిషోర్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హామీ ఇచ్చాని టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పీకే కాంగ్రెస్‌లో చేరితే టీఆర్ఎస్ కోసం పీకే టీమ్ ఏ విధంగా చేస్తుందన్న చర్చ సాగుతోంది. పీకే టీమ్ కేసీఆర్ కోసం పని చేస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని ఇతర పార్టీల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పీకే విషయంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
దీంతో ప్రశాంత్ కిషోర్‌కు ప్రత్యామ్నాయం గురించి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు టీఆర్ఎస్లో చర్చ నడుస్తోంది. పీకే కంటే ముందే సునీల్ కుమార్ టీమ్ కేసీఆర్‌తో సమావేశమైందని టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ కోసం సునీల్ పని చేయడం కష్టమన్న ప్రచారం ఉంది. సునీల్ గతంలో పీకేతో పని చేసిన అనుభవం ఉంది. దీంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి, ఎమ్మెల్యే, మంత్రుల పనితీరు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజాభిప్రాయం సేకరించేందుకు సునీల్ కుమార్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని గులాబీ నేతలు చెబుతున్నారు.