కొత్తగూడెం డీఎస్పీ వంట మనిషికి కరోనా..ఈమె ద్వారా ?

తెలంగాణాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారికే కాకుండా..వీరి ద్వారా స్థానికులకు కరోనా వైరస్ సోకుతోంది. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం కొత్తగా ఆరు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 39కి చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణీకులు కాగా..ముగ్గురు స్థానికులు.
వైరస్ బారిన పడిన వారిలో కొత్తగూడెం డీఎస్పీ, ఆయన ఇంట్లో పనిచేసే వంట మనిషికి వైరస్ సోకడం కలకలం రేగింది. విదేశాల నుంచి వచ్చిన ఆయన కుమారుడు…వైరస్ బారిన పడ్డాడు. తెలంగాణాలో 25వ పాజిటివ్ కేసుగా నమోదైన ఓ వ్యక్తి ద్వారా…ఓ మహిళకు కూడా…లోకల్ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో లోకల్ కాంటాక్ట్ ద్వారా పాజిటివ్ వచ్చిన కేసుల సంఖ్య 5కి చేరుకుంది. ఆ మహిళ ఎవరితో తిరిగింది ? ఎవరితో మాట్లాడింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
* లండన్ నుంచి వచ్చిన తన కొడుకుని క్వారంటైన్ చేయకుండా బయటకు పంపినందుకు డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
* లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది.
* విదేశాల నుంచి వచ్చి నిబంధనలు ఉల్లంఘించి 72మందిపైనా చర్యలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది.
* డీఎస్పీ కుటుంబసభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
* డీఎస్పీ కొడుకు లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. మార్చి 18న లండన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు.
* అక్కడి నుంచి కారులో కొత్తగూడెం వెళ్లినట్లు తెలుస్తోంది.
* మార్చి 20న దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనాగా అనుమానించి ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు.
* అతడి నమూనాలను పరీక్షలకు పంపించారు. ఆదివారం (మార్చి 22) అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో దశకు చేరుకోవడంతో..ప్రజలు భయపడిపోతున్నారు. లాక్ డౌన్ ప్రకటించినా..ప్రజలు సహకరించకపోవడంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. నిబంధనలు పాటించాల్సిందేనంటూ…ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు భారత ప్రధాన మంత్రి 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇదే కంటిన్యూ అయితే..మూడో స్టేజీకి వెళ్లే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.
Also Read | ఫ్లిప్‌కార్ట్ సర్వీసులు బంద్