Thumkunta Narsareddy: చంద్రబాబు, వైఎస్సార్ ఎన్నడూ బతిమిలాడలేదు.. ఇప్పుడు కేసీఆర్ మాత్రం..: కాంగ్రెస్ గజ్వేల్ అభ్యర్థి
కేసీఆర్ గజ్వేల్లో కాకుండా వేరే నియోజక వర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నారని నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ కార్యకర్తలను..

KCR-Thumkunta Narsareddy
Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తూముకుంట నర్సారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తూముకుంట నర్సారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేసీఆర్ గజ్వేల్లో కాకుండా వేరే నియోజక వర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నారని నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ కార్యకర్తలను ఆ సమావేశాలకు తీసుకొస్తున్నారని, తనపై దయ చూపాలని, ఇకపై నెలకు ఒక సారి వారితో ఉంటానని అంటున్నారని చెప్పారు. కార్యకర్తలను బతిమిలాడుకునే దుస్థితికి కేసీఆర్ వచ్చారని విమర్శించారు.
గత ప్రభుత్వాలలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ ఇలా వారి కార్యకర్తలను బతిమిలాడలేదని అన్నారు. కేసీఆర్ పదేళ్లలో గజ్వేల్ నియోజక వర్గ మండలాలకు వెళ్లలేదని చెప్పారు. కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాక చాలా మంది చనిపోయారని అన్నారు.
ఇంతవరకు తాను గజ్వేల్‌కు ఏమీ చేయలేదని, ఇకపై చేస్తానని కేసీఆర్ అంటున్నారని నర్సారెడ్డి ఆరోపించారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ ఓడిపోతారని ఇంటెలిజెన్స్ రిపోర్టుల ద్వారా తెలిసిందని, ఆ భయంతోనూ ఇప్పుడు కార్యకర్తలతో సమావేశాలు పెట్టి బతిమిలాడుతున్నారని చెప్పారు. మల్లన్నసాగర్‌లో భూములు కోల్పోయిన వారికి ఇప్పటికీ ప్యాకేజీలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే భూ నిర్వాసితులకు సరైన న్యాయం చేస్తామని అన్నారు.
Gaddar Daughter Vennela : ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా : గద్దర్ కుమార్తె వెన్నెల