అమ్మో పులి.. రోడ్డు దాటుతూ కనిపించిన పులి, హడలిపోయిన వాహనదారులు..

అదెక్కడ తమపై దాడి చేస్తుందోనని టెన్షన్ పడ్డారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అమ్మో పులి.. రోడ్డు దాటుతూ కనిపించిన పులి, హడలిపోయిన వాహనదారులు..

Updated On : November 18, 2024 / 1:10 AM IST

Tiger Tension : ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్నటి నుంచి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. శనివారం ఉట్నూరు మండలం వంకతుమ్మలో పశువులపై దాడి చేసిన పెద్ద పులి.. ఆదివారం లాల్ టెక్డి సమీపంలో సంచరిస్తోంది. రోడ్డు దాటుతుండగా వాహనదారులకు పెద్ద పులి ఎదురైంది. పులి దృశ్యాలను వాహనదారులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం పెద్ద పులి జైనూరు మండలం వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. చీమ్ నాయక్ తండా-నాగ్ పూర్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద పులి పాద ముద్రలు కనిపించాయి. దీంతో గ్రామస్తులు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు.

కారులో వెళ్తున్న వ్యక్తులకు సడెన్ గా పెద్ద పులి కనిపించింది. పులి రోడ్డు దాటుతూ వారి కంటపడింది. పులిని అతి దగ్గరి నుంచి ప్రత్యక్షంగా చూసిన వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదెక్కడ తమపై దాడి చేస్తుందోనని టెన్షన్ పడ్డారు. కొందరు వాహనదారులు పులిని తమ ఫోన్ లో వీడియో తీశారు. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పెద్ద పులి సంచారం నేపథ్యంలో రాత్రి వేళ ప్రజలు ఎవరూ తిరగొద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. అటు, పెద్ద పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

పెద్ద పులి ప్రయాణం కొమ్రంభీమ్ జిల్లా జైనూరు వైపు ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం సమయంలో ఉట్నూరు మండలంలోనే పశువుపై దాడి చేసింది పులి. ఇది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆ తర్వాత లాల్ టెక్డి వద్ద కనిపించింది. గత 15-20 రోజులుగా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పూర్తిగా సంచరించిన పులి.. ప్రస్తుతం కొమ్రంభీమ్ జిల్లా వైపు పులి అడుగులు ఉన్నట్లుగా తెలుస్తోంది. జైనూర్ మండలం ప్రజలందరిని ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు.

Also Read : ప్రతి నెల 4శాతం లాభం అంటూ రూ.300 కోట్లు కొట్టేసిన కేటుగాడు..