రిజర్వేషన్లు ఉంటేనే రైలు ప్రయాణం..

Train travel if there are reservations says South Central Railway CPRO Rakesh : సంక్రాంతి పండుగ రద్దీకి అనుగుణంగా దక్షిణమధ్య రైల్వే అదనపు రైళ్లు నడుపుతుంది. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, మచిలీపట్నం,బెంగళూర్, చెన్నై, భువనేశ్వర్, తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కోవిడ్ దృష్ట్యా బోగీ సీట్ల సామర్ధ్యం మేరకే రైళ్లు బయలుదేరుతున్నాయి. రిజర్వేషన్లు ఉంటేనే రైలు ప్రయాణాలకు అనుమతి ఉందని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేష్ తెలిపారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి… ఈసారి కూడా రెగ్యులర్ రైళ్లు లేనట్టే. స్పెషల్ ట్రైన్స్‌లోనే జర్నీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అన్‌లాక్ తర్వాత రైళ్లకు డిమాండ్ పెరిగింది. రెగ్యులర్ రైళ్లకు లాక్ తీయకపోవడంతో.. పేద, మధ్య తరగతికి చెందిన ప్రయాణికులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు… సాధారణ రైళ్లలో కంటే అదనంగా చార్జీలు వసూలు చేస్తోంది రైల్వేశాఖ.
కనీసం సంక్రాంతికైనా రైల్వేశాఖ రెగ్యులర్ రైళ్లను నడుపుతుందని అందరూ ఎదురు చూశారు. కానీ రైల్వేశాఖ మాత్రం చావు కబురు చల్లగా చెప్పినట్టు… రెగ్యులర్ రైళ్లను నడపడం లేదని.. కేవలం స్పెషల్ రైళ్లను మాత్రమే నడుపుతున్నట్టు ప్రకటించింది. దీంతో పండుగకైనా సొంతూళ్లకు రైళ్లలో వెళ్లాలనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. సంక్రాంతికి ప్రజలు భారీ సంఖ్యలో సొంతూళ్లకు పోతారని తెలిసి కూడా.. రెగ్యులర్ రైళ్లను నడపకూడదని రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది.
హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లనే నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఇప్పటికే స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నట్టు వెల్లడించింది. ముందే టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకున్న వారినే ప్రయాణానికి అనుమతిస్తోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్‌కు ఈనెల 10న స్పెషల్ ట్రైన్స్ ప్రారంభమయ్యాయి. ఈ రూట్‌లో 16వ తేదీ వరకు ట్రైన్స్‌ను నడుపుతుంది. కాచిగూడ – చిత్తూరు మధ్య ఈనెల 8నే స్పెషల్ ట్రైన్స్ ప్రారంభమయ్యాయి. ఇవి ఈనెల16 వరకు కొనసాగనున్నాయి.
ఇక సికింద్రాబాద్ – కాకినాడ మధ్య 8న ప్రారంభమైన స్పెషల్ రైళ్లను.. 20వ తేదీ వరకు కంటిన్యూ చేయనుంది. కరోనా నేపథ్యంలో ప్రయాణికులంతా కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. సాధారణ రైళ్లను నడపడం సాధ్యంకాదంటున్న దక్షిణ మధ్య రైల్వే..స్పెషల్ ట్రైన్స్‌ను కొన్నింటిని మాత్రం పొడిగించింది. వివిధ రూట్లలో ఏర్పాటు చేసిన 30 స్పెషల్ ట్రైన్స్‌ను మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.