IAS IPS Transfer : తెలంగాణలో త్వరలోనే ఐఎఎస్, ఐపీఎస్‌ల బదిలీ
సంక్షేమ పథకాలతో అధికారయంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్....సీనియర్ అధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కీలక పోస్టుల్లో ఉన్నవారికి స్థానభ్రంశం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Transfer Of Ias And Ips
Telangana IAS and IPS Transfer : సంక్షేమ పథకాలతో అధికారయంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్….సీనియర్ అధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కీలక పోస్టుల్లో ఉన్నవారికి స్థానభ్రంశం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల సమాచారం ఇప్పటికే సీఎంవోకు చేరుకుంది. ఆ సమాచారం ఆధారంగా ఐఎఎస్, ఐపీఎస్‌లను త్వరలో బదిలీ చేసే అవకాశం ఉంది.
పనితీరుపై సీఎం కేసీఆర్ ఆరా
అడిషినల్ కలెక్టర్లను బదిలీ చేసిన తెలంగాణ సర్కార్…త్వరలోనే సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్‌ల బదిలీ చేయనున్నట్లు చర్చ నడుస్తోంది. కీలక పోస్టుల్లో ఉన్నవారి పనితీరుపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఎవరు, ఎక్కడ, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు….?, వారి పనితీరు ఎలా ఉంది..?, ప్రభుత్వ పథకాలను అమలుచేయడంలో ఎలా పనిచేస్తున్నారు..? అనే పూర్తి సమాచారం సీఎంవోకు చేరడంతో.. వివిధ విభాగాల అధికారుల సమాచారం సీఎంకు అందించారు.
ఒక ఐఎఎస్ అధికారికి ఒకటి లేదా రెండు శాఖలు
రాష్ట్ర స్థాయిలో, ముఖ్యంగా సచివాలయంలో ఎక్కువకాలం ఒకే పోస్ట్‌లో కొనసాగుతున్న, ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నవారి వివరాలను సీఎం కేసీఆర్ తెప్పించుకున్నారు. ఒక్కో ఐఎఎస్ ఆఫీసర్ మూడు, నాలుగు శాఖల బాధ్యతలు చూస్తున్నారు. అధికారులపై పని ఒత్తిడితో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావిస్తున్న ముఖ్యమంత్రి…ఒక అధికారికి ఒక శాఖ ఉండే విధంగా, తప్పనిసరి అయితే రెండు శాఖల బాధ్యతలు చూసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
కరోనా తగ్గుముఖం, దళిత బంధు అమలుతో బదిలీల ఆలోచన
గత నెలలో 10 మంది అడిషినల్ కలెక్టర్లను బదిలీచేసిన ప్రభుత్వం…9 మంది ట్రైనీ కలెక్టర్లను కూడా వివిధ జిల్లాలకు కేటాయించింది. ఇప్పుడు ఐఎఎస్, ఐపీఎస్‌లపై దృష్టి సారించడానికి కారణం లేకపోలేదు. సీనియర్ అధికారుల పనితీరుపై అసంతృప్తి ఉన్నా వారిని పెద్దగా బదిలీచేయలేదు. మొత్తంగా చూస్తే..నాలుగైదేళ్లుగా ఐఎఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరగలేదు. ఇప్పుడు కరోనా కేసులు తగ్గడం, కొత్తగా దళిత బంధు అమల్లోకి రావడంతో పాలనను గాడిలో పెడుతున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా వివిధ శాఖలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలను త్వరలోనే బదిలీ చేయనున్నారని తెలుస్తోంది.
పోలీస్ ఉన్నతాధికారుల్లోనూ భారీ మార్పులు
చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్..ల్యాండ్ రెవెన్యూ, స్టాంప్ ఆండ్ రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల బాధ్యతలను చూస్తుండడంతో ఆయా శాఖల్లోని కొన్ని శాఖల బాధ్యతలను మరికొందరు ఐఎఎస్‌లకు అప్పగించనున్నారు. పలు శాఖల్లో రెండేళ్లకు పైబడి పనిచేస్తున్న అధికారులను, జిల్లాల్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కలెక్టర్లనూ బదిలీ చేయనుంది. పోలీస్ ఉన్నతాధికారుల్లోనూ భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న పోలీసు ఆఫీసర్లకు త్వరలో ట్రాన్స్‌ఫర్లు తప్పేలా లేవు. ఓవరాల్‌గా చూస్తే తెలంగాణలో మూల విరాట్‌లుగా ఉన్న చాలామంది ఆఫీసర్లకు ఈ సారి స్థానభ్రంశం తప్పదు. ఈ బదిలీల్లో పనితీరు, ఆయా స్థానాల్లో చేసిన సర్వీస్ ప్రామాణికం కానున్నాయి.