Union Budget : ఇది ప్రజా, కార్మిక, రైతు, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్- టీఆర్ఎస్ ఎంపీలు

ఇది పేదలు, వ్యవసాయ, కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్ అన్నారు. పేదలు, రైతులు, ఉద్యోగుల గురించి ప్రస్తావనే లేదన్నారు. కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరుత్సాహపరిచిందని..

Union Budget : ఇది ప్రజా, కార్మిక, రైతు, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్- టీఆర్ఎస్ ఎంపీలు

Union Budget 2022 Trs Mps

Updated On : February 1, 2022 / 7:16 PM IST

Union Budget 2022 : కేంద్ర బడ్జెట్ పై టీఆర్ఎస్ ఎంపీలు స్పందించారు. కేంద్ర బడ్జెట్ పై పెదవి విరిచారు. కేంద్ర బడ్జెట్ నిరుత్సాహపరిచిందని టీఆర్ఎస్ పార్లమెంటరి పార్టీ నేత కే.కేశవరావు అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత దిశ లేని బడ్జెట్ గా ఉందని విమర్శించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం అన్న మాట ఉంది.. కానీ కేటాయింపులు కనపడటం లేదన్నారు. ఆరోగ్య రంగానికి 1.1 శాతం పెంపు మాత్రమే ఉందన్నారు. ఉపాధి హామీ ద్వారా ఉద్యోగ కల్పన జరిగింది, గ్రామీణ ఆర్ధిక వృద్ది జరిగింది.. అలాంటి ఉపాధి హామీకి 25శాతం నిధులు తగ్గాయని అన్నారు. గ్రామీణాభివృద్ధికి కూడా నిధులు తగ్గాయన్నారు.

కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఇది పేదలు, వ్యవసాయ, కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్ అన్నారు. పేదలు, రైతులు, ఉద్యోగుల గురించి ప్రస్తావనే లేదన్నారు. బీజేపీ పెద్దలు అమృత కాలం అంటున్నారు.. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే అమృత కాలం ఎలా అంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ అమృత కాలం అంటున్నారని ధ్వజమెత్తారు. ఏం మాట్లాడినా డిజిటల్ అంటున్నారు, వ్యవసాయం కూడా డిజిటల్ అంటున్నారు, డిజిటల్ రూపీ, డిజిటల్ ఫార్మింగ్ అన్నీ డిజిటల్ అంటున్నారు. ఇది ప్రజలను ఇబ్బంది పెట్టే బడ్జెట్ లా ఉందన్నారు. కరోనా సమయంలో రైతులు పండించిన పంటల వల్ల బతికాము, సర్వీస్ సెక్టార్ కాపాడింది అని చెప్పారు. కేంద్రం.. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు.

Union Budget 2022: బడ్జెట్ తర్వాత బూట్లు, బట్టల ధరలు తగ్గాయి.. ఏవి పెరిగాయో తెలుసా?

” ఇది ప్రజా, రైతు వ్యతిరేక బడ్జెట్. లాండ్ రిజిస్ట్రేషన్ జాతీయం చేయాలనుకుంటున్నారు. భూమి.. రాష్ట్ర అంశం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కోసం గత పార్లమెంట్ సమావేశాల్లో పోరాడి సమావేశాలను బహిష్కరించాం. ధాన్యం సేకరణపై జాతీయ సేకరణ విధానం తీసుకొస్తే బాగుండేది” అని నామా నాగేశ్వరరావు అన్నారు.

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ప్రవేశపెట్టారు. మొత్తం రూ.39.45 లక్షల కోట్లతో బడ్జెట్ ను పెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని మంత్రి అన్నారు. కేంద్ర బడ్జెట్ ను నిర్మల ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి.

ఇలా వరుసగా నాలుగేళ్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఘనత సాధించారు. ఇందిరా గాంధీ 1970లో ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళ నిర్మల. ఇప్పటివరకు ఎక్కువసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్‌ (10 సార్లు) పేరు మీద ఉంది. ఆ తర్వాత చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ 9 సార్లు.. యశ్వంత్‌రావు చౌహాన్‌, సీడీ దేశ్ ముఖ్‌ 7 సార్లు.. టీటీ కృష్ణమాచారి, మన్మోహన్‌ సింగ్‌ 6 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

CM KCR : నదుల అనుసంధానం మిలీనియానికే బిగ్ జోక్ : సీఎం కేసీఆర్

బడ్జెట్ అంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశతో చూస్తారు. కానీ అవేం నెరవేరలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని, ఆదాయంపై ప్రభావం చూపించే నిర్ణయాలకు దూరంగా కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ అంశాలకు బడ్జెట్ లో అధికా ప్రాధాన్యం దక్కింది.

కాగా, బడ్జెట్ లో వేతన జీవులకు పన్ను పరంగా కేంద్రం ఎటువంటి ఊరట కల్పించ లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల విషయంలోనూ పన్నుపరంగా ఎటువంటి ఉపశమనం లేదన్నారు.