ట్రంప్ గుడి కోసం కృష్ణ ఆస్తిని అమ్మేశాడు..అతని కుటుంబాన్ని ఆదుకోవాలంటున్న గ్రామ ప్రజలు

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 07:27 AM IST
ట్రంప్ గుడి కోసం కృష్ణ ఆస్తిని అమ్మేశాడు..అతని కుటుంబాన్ని ఆదుకోవాలంటున్న గ్రామ ప్రజలు

Updated On : October 12, 2020 / 8:12 AM IST

Trump Fan Bussa Krishna : అమెరికా అధ్యక్షుడిని దేవుడిలా పూజించిన బుస్స కృష్ణ మృతి అందరినీ కలిచివేసింది. డొనాల్డ్‌ ట్రంప్‌‌కు కరోనా సోకినప్పటి నుంచి మనోవేదనకు గురైన కృష్ణ ఆదివారం గుండెపోటుతో మరణించారు. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం స్వగ్రామంలో మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.



కృష్ణ.. ఓ వీరాభిమాని.. తాను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్న ట్రంప్‌నకు కరోనా సోకిందన్న మనోవ్యధతో గుండె పగిలి చనిపోయాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కృష్ణ.. ట్రంప్‌పై అభిమానంతో ఆయనకు గుడికట్టి విగ్రహానికి పూజలు చేశాడు. ట్రంప్‌నకు కరోనా సోకిందని తెలియగానే బుస్స కృష్ణ కుమిలిపోయాడు.



మానసికంగా తీవ్ర ఆవేదన చెందాడు. నిద్రహారాలు మానేశాడు. ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు. కరోనాకు ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాక ట్రంప్‌ కోలుకోగా… అతడి అభిమాని కృష్ణ మాత్రం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.



కృష్ణ మృతితో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతడిని ట్రంప్‌ కృష్ణ అని పిలుచుకునే వారమని.. అందరితో ఎప్పుడు కలివిడిగా ఉండే వాడని.. స్థానికులు చెబుతున్నారు. కృష్ణ అంత్యక్రియలకు ఆయన స్వగ్రామంలో ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబసభ్యులు. ట్రంప్‌నకు గుడి కట్టించేందుకు కృష్ణ తన ఆస్తినంతా అమ్మాడని.. ఆయన తల్లిదండ్రులు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.