TV actress Sravani Kondapalli : దోషులు ఎవరు ?

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 11:46 PM IST
TV actress Sravani Kondapalli : దోషులు ఎవరు ?

Updated On : September 14, 2020 / 6:30 AM IST

Sravani Kondapalli dies : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. సాయి కృష్ణా రెడ్డి, దేవరాజ్‌ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం నుంచి ఇద్దరినీ ప్రశ్నించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. తర్వాత వారిద్దరినీ అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు. 2020, సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం వీరిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరుస్తారు.



అలాగే శ్రావణి తల్లి తండ్రుల వాంగ్మూలం రికార్డు చేశారు. నిర్మాత అశోక్‌రెడ్డిని కూడ విచారిస్తారు. సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌రెడ్డిని విచారించిన పోలీసులు.. శనివారం సాయి, శ్రావణి కుటుంబ సభ్యులను కూడా విచారించారు. సాయి వద్ద ఉన్న ఆధారాలను సేకరించారు. వారిద్దరినీ అరెస్ట్‌ చేశారు. సాయి మాత్రం దేవరాజ్‌రెడ్డి వల్లే శ్రావణి చనిపోయినట్టు తెలిపాడు.



విచారణకు ముందు శ్రావణి కుటుంబ సభ్యులతో తనకున్న సంబంధం.. దేవరాజ్‌రెడ్డి శ్రావణితో వ్యవహరించిన తీరుకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయని చెప్పాడు. తాను ఏ తప్పు చేయలేదని.. నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. సీరియల్ చేసుకుంటూ మంచి జీవితాన్ని అనుభవిస్తున్న తన కూతురును దేవరాజే నాశనం చేశాడని శ్రావణి తల్లి ఆరోపిస్తోంది.

దేవరాజ్‌ అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాడని.. అలాంటి వాడికి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. శ్రావణిని తీసుకురావాలని సాయిని తామే పంపించామని చెప్పారు శ్రావణి తల్లి. దేవరాజ్‌పై కేసు పెట్టడంతో.. తమ కూతురిని ఏమైనా చేస్తాడన్న భయంతోనే సాయిని, తమ కుమారుడిని పంపించినట్లు తెలిపారు. శ్రావణి రానని చెప్పడంతో కొట్టి తీసుకొచ్చాడని.. అంతే తప్ప తనపై ఎలాంటి దాడి చేయలేదని చెప్పారు.



తమ సోదరి చావుకి కారణం దేవరాజ్‌రెడ్డే అన్నారు శ్రావణి సోదరుడు. దేవరాజ్‌ గురించి తెలియనప్పుడు శ్రావణి తనని ప్రేమించిందని.. తన అసలు రంగు బయటపడగానే దూరంగా ఉందని తెలిపారు. ఈ విషయం తెలిసి కొంత వాగ్వాదం జరిగిందని.. ఆ సమయంలోనే దేవరాజ్‌కు గాయాలయ్యాయని తెలిపారు.