Bandi Sanjay: ఉర్దూ యూనివర్సిటీ భూముల స్వాధీనానికి జిల్లా కలెక్టర్ నోటీసులు.. బండి సంజయ్ సీరియస్

విద్యార్థుల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే వర్సిటీల, విద్యా సంస్థల భూములపై కన్నేయడం సిగ్గు చేటు అని ధ్వజమెత్తారు. Bandi Sanjay

Bandi Sanjay: ఉర్దూ యూనివర్సిటీ భూముల స్వాధీనానికి జిల్లా కలెక్టర్ నోటీసులు.. బండి సంజయ్ సీరియస్

Bandi Sanjay Representative Image (Image Credit To Original Source)

Updated On : January 7, 2026 / 5:25 PM IST

 

  • భూములను అమ్మి దోచుకోవాలనుకుంటున్నారా?
  • విద్యా సంస్థల జోలికొస్తే ఖబర్దార్
  • పాతబస్తీలో సల్కం చెరువును కబ్జా చేసిన ఒవైసీపై చర్యలు ఏవి?

Bandi Sanjay: హైదరాబాద్ మౌలానా ఉర్దూ యూనివర్సిటీ భూముల స్వాధీనానికి జిల్లా కలెక్టర్ నోటీసులు ఇవ్వడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. 50 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో కలెక్టర్ పేర్కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల విలువైన వర్సిటీ భూములను అమ్మి దోచుకోవాలనుకుంటున్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

కనీస సౌకర్యాలు కల్పించడం చేతకాని ప్రభుత్వం విద్యా సంస్థల భూములను అమ్ముకోవాలనుకుంటోందని ఆయన ఆరోపించారు. విద్యా సంస్థల జోలికొస్తే ఖబర్దార్ అంటూ సర్కార్ కు అల్టిమేటం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైన అనేక ప్రభుత్వ భూములున్నాయని చెప్పారు. పాతబస్తీలో సల్కం చెరువును కబ్జా చేసి విద్యా వ్యాపారం చేస్తున్న ఒవైసీపై చర్యలేవి? అని బండి సంజయ్ నిలదీశారు. వాటిని స్వాధీనం చేసుకుని ప్రజల అవసరాలకు ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నించారు.

విద్యార్థుల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే వర్సిటీల, విద్యా సంస్థల భూములపై కన్నేయడం సిగ్గు చేటు అని ధ్వజమెత్తారు. తక్షణమే సర్కార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

Also Read: కవిత రాజీనామా ఆమోదం తరువాత.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక కామెంట్స్

నిబంధనలను ఉల్లంఘించినందున 1998లో కేటాయించిన 200 ఎకరాల భూమిలో 50 ఎకరాలను ఎందుకు వెనక్కి తీసుకోకూడదు అని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విశ్వవిద్యాలయానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. నోటీసును అధ్యయనం చేసిన తర్వాత వివరణాత్మక ప్రతి స్పందనను సమర్పించడానికి 2 నెలల సమయం కోరింది విశ్వవిద్యాలయం. కాగా, MANUU క్యాంపస్‌లో వివిధ విద్యా భవనాలు, నివాస హాస్టళ్లు, వసతి సౌకర్యాల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రక్రియ మొదలైంది.

షోకాజ్ నోటీసులపై వర్సిటీ విద్యార్థులకు ఆందోళన చెందుతున్నారు. భూములను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. విశ్వవిద్యాలయ భూములు దాని విద్యార్థులు, ఉపాధ్యాయులు, భవిష్యత్ తరాల విద్యార్థులకే చెందుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇష్టాయిష్టాలకు కాదని విద్యార్థులు తేల్చి చెప్పారు.