మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఈ మూడు రాష్ట్రాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది..

Kishan Reddy : మహారాష్ట్ర ఫలితాలతో తెలంగాణ బీజేపీలో మరింత జోష్ వచ్చింది. మరోసారి అక్కడ అధికారంలోకి రావడంతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. కర్ణాటక, తెలంగాణలో జరుగుతున్న పాలనను మహారాష్ట్ర ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యామంటున్నారు కమలనాథులు. తెలంగాణ నుంచి నేతలు వెళ్లి చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో బీజేపీ విజయం సాధించిందని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజలు నమ్మడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా గ్యారెంటీల గారడీతో మోసం చేయాలని చూసిన ఇండియా కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితం అయ్యిందంటూ ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి.
”ప్రధాని మోదీ నేతృత్వంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ చేసిన పనిని ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చాం. మహారాష్ట్రలో మూడోసారి అధికారంలోకి రావడం ఇందుకు నిదర్శనం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. గ్యారెంటీల పేరుతో మభ్యపెట్టిన తెలంగాణ, కర్ణాటక.. గ్యారెంటీల పేరుతో దివాళా తీసిన హిమాచల్ ప్రదేశ్.. ఈ మూడు రాష్ట్రాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది” అని విమర్శించారు కిషన్ రెడ్డి.
”ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే వ్యక్తులు, శక్తులతో కలిసినందుకు మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారు. బీజేపీకి మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రేపై విశ్వాసం ఉన్న ఓటర్లంతా మూకుమ్మడిగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పార్టీలకు మద్దతిచ్చారు. స్పష్టమైన మార్పు మహారాష్ట్రలో కనిపించింది. బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే, మనవడు ఆదిత్య ఠాక్రే.. వీళ్ల మాటలను లెక్క చేయకుండా ప్రజలు బాలాసాహెబ్ ఠాక్రే మీదున్న అభిమానంతో ఆయన ఆలోచన విధానంతో, స్ఫూర్తితో.. కొడుకును కూడా లెక్క చేయకుండా, శివసేనకు వారితో కలిసిన పార్టీకు సరైన రీతిలో బుద్ధి చెప్పారు.
ఉద్ధవ్ ఠాక్రేకు వచ్చిన కొన్ని సీట్లు కూడా శివసేనకు వచ్చినవి కాదు. శివసేన వ్యతిరేక ఓట్లతో ఆ సీట్లు వచ్చాయి. నిజమైన శివసేన టోటల్ గా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరింది. ప్రజలు చాలా చైతన్యవంతులు అనే విషయం మరోసారి మహారాష్ట్ర ఎన్నికల్లో స్పష్టమైంది. శివసేనను ఏ లక్ష్యాల కోసం పెట్టారు, ఆయన కొడుకు పార్టీని ఎవరి చేతిలో పెట్టారు.. దానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు.. శివసేన ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారో, మహారాష్ట్ర ప్రజలు కూడా అదే రీతిలో ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసి బాలాసాహెబ్ ఆలోచన విధానంతో నరేంద్ర మోదీ నాయకత్వానికి అండగా నిలబడటం అనేది ఎన్నికలో మరొక ప్రత్యేకత” అని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read : దటీజ్ పవన్ కల్యాణ్.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని మార్క్..! సంబరాల్లో జన సైనికులు..