అదానీ ఆస్తిపరుడు అయ్యారంటే ప్రధాని మోదీనే కారణం: వీహెచ్

తాను పిలిచినప్పుడే రావాలి అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మండిపడ్డారు.

అదానీ ఆస్తిపరుడు అయ్యారంటే ప్రధాని మోదీనే కారణం: వీహెచ్

Congress Senior Leader V Hanumantha Rao

Updated On : January 17, 2024 / 2:05 PM IST

V Hanumantha rao: దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు విరుచుకుపడ్డారు. బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేట్ సెక్టార్‌కే మోదీ లాభం చేకూరుస్తున్నారని ఆరోపించారు. అంబానీని మించి అదానీ అస్తిపరుడు అయ్యారంటే దానికి ప్రధాని మోదీనే కారణమని అన్నారు. దేశంలో 25 కోట్ల పేదలను ధనికులకు చేశానన్న మోదీ మాటలకు నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రైతులకు మద్దతు ధర పెంచమని అని అడిగితే ఇప్పటికీ స్పందించలేదని విమర్శించారు.

రాములవారి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం
రాముడు మీద బీజేపీకి ప్రేమ లేదని, హిందు ఓట్ల కోసం రామ నామ జపం చేస్తోందని హనుమంతరావు ఆరోపించారు. రాములవారిని కూడా రాజకీయాల్లోకి లాగి ఓట్లు సంపాదించాలని బీజేపీ చూస్తోందన్నారు. దేవుడి మీద అందరికీ భక్తి ఉంటుందని, తాను పిలిచినప్పుడే రావాలి అన్నట్టుగా మోదీ వ్యవహారం ఉందని మండిపడ్డారు. ”నువ్వు పిలిచినప్పుడు ఎందుకు రావాలి.. మాకు పోవాలి అనిపించినప్పుడు పోతమ”ని తనదైన శైలీలో వీహెచ్ స్పందించారు. కాగా, అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు హాజరుకాబోమని కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయోధ్య రామాలయంలో ఈ నెల 22న జరిగే శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమాన్ని బీజేపీ తన సొంత వ్యవహారంలా మార్చేసిందని ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ఆరోపిస్తున్నాయి. విపక్షాల ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.

Also Read: దావోస్‌లో సరికొత్త లుక్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. వైరల్‌గా మారిన పిక్స్

తమ్మినేనికి వీహెచ్ పరామర్శ
హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని ఈరోజు హనుమంతరావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కాగా, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న తమ్మినేని వీరభద్రాన్ని మంగళవారం ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు.