అనారోగ్యంతో మహిళ మృతి.. కరోనా భయంతో దగ్గరకు రాని బంధువులు.. చెత్తబండిలో తీసుకెళ్లి అంత్యక్రియలు!

  • Published By: sreehari ,Published On : March 27, 2020 / 09:47 AM IST
అనారోగ్యంతో మహిళ మృతి.. కరోనా భయంతో దగ్గరకు రాని బంధువులు.. చెత్తబండిలో తీసుకెళ్లి అంత్యక్రియలు!

Updated On : March 27, 2020 / 9:47 AM IST

దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరీంనగర్‌లో కరోనా వైరస్ అక్కడి స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారంలో ఓ విషాదం చోటుచేసుకుంది. కొసరి రాజవ్వ అనే 55 ఏళ్ల మహిళ అనారోగ్యంతో మృతిచెందింది. కరోనా భయంతో ఎవరూ ఆమె మృతదేహం దగ్గరు రాలేదు. మహిళ బంధువులు సైతం అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. చివరి చూపు చూసేందుకు బంధువులు ఎవరూ రాక అనాథ శవంలా మారింది. బతికి ఉన్నప్పుడు దగ్గరికి వచ్చినవారంతా చనిపోయిక కనీసం చివరి చూపు చూసేందుకు రాలేని దయనీయ పరిస్థితి… మహిళకు సంతానం లేదు. 

రెండు నెలల క్రితమే ఆమె భర్త అంజయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. అతడు చనిపోయినప్పటి నుంచి తనను దిక్కెవరు లేరని మానసికంగా కృంగిపోయింది. అనారోగ్యం పాలై ఆఖరికి ప్రాణాలు విడిచింది. రాజవ్వ మృతితో అక్కడి స్థానికులు బంధువులకు ఆమె మరణవార్త తెలియజేశారు. కానీ, బంధువులు కరోనా భయానికి ఎవరూ ముందుకు వచ్చేందుకు ధైర్యం చేయలేదు. చేసేది ఏమిలేక ఆ ఊరి సర్పంచ్ దగ్గరుండి రాజవ్వ అంత్యక్రియలను నిర్వహించారు. 

మున్సిపాలిటీ బండీలో రాజవ్వ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనా దెబ్బతో రాజవ్వ శవం అనాథగా తీసుకెళ్లడాన్ని చూసినవారంతా కన్నీరుమున్నీరయ్యారు. బతికి ఉన్నంతకాలం దగ్గరికి వచ్చిన మనుషులంతా చనిపోయాక కనీసం కన్నెత్తి అయినా చూడలేదని వాపోయారు. ఈ పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదని స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

Also Read | మోడీ నియోజకవర్గంలో గడ్డి తిన్న చిన్నారులు…అసహ్యంగా ఉందన్న పీకే