Vogo బైక్ దొంగలు దొరికారు..ఎలా చోరీ చేస్తారంటే

Vogo బైక్ దొంగలు దొరికారు..ఎలా చోరీ చేస్తారంటే

Updated On : February 12, 2021 / 7:06 PM IST

Vogo bike : హైదరాబాద్‌లో వోగో మోటర్‌ సర్వీసెస్‌ సంస్థ (Vogo bikes) బైక్‌లను అద్దెకు ఇస్తుంటుంది. ముఖ్యంగా మెట్రో స్టేషన్లు కేంద్రంగా ఈ సంస్థ బైక్‌లను ఆన్‌లైన్‌లో అద్దెకు ఇస్తుంది. బైక్‌లు అవసరం ఉన్న వారు యాప్‌ ద్వారా వాటిని బుక్‌ చేసుకుంటారు. ఈ బైక్స్‌కు కీస్‌ కూడా ఉండవు. జీపీఎస్‌ సిస్టమ్‌ ద్వారానే తిరిగిన దూరాన్ని బట్టి ఆ సంస్థ అద్దె వసూలు చేస్తుంది. నగరానికి చెందిన రిజ్వాన్‌, యాసీన్‌, అమ్జాద్‌, వాజీద్‌తోపాటు మరో ముగ్గురి కలిసి ముఠాగా ఏర్పడ్డారు. డబ్బులు, జల్సాల కోసం బైక్‌ చోరీలకు అలవాటు పడ్డారు.

ఈ నేపథ్యంలో ఈ ముఠా వోగో మోటర్‌ బైక్‌లపై కన్నేసింది. రెగ్యులర్‌ ప్రయాణికుల్లా మెట్రో స్టేషన్‌ (Metro stations)కు చేరుకునే వారు. ఆ తర్వాత తప్పుడు వివరాలు ఇచ్చి బైక్‌ను అద్దెకు తీసుకునేవారు. కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్‌కు ఉన్న జీపీఎస్‌ సిస్టమ్‌, ఇతర పరికరాలను తొలగించేవారు. ఆ తర్వాత బైక్‌ను అమ్మి.. వచ్చిన డబ్బుతో జల్సా చేసేవారు. మెట్రో స్టేషన్లలో తమ బైక్‌లు ఎక్కువగా పోతుండడంతో..వోగో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వలపన్ని.. బైక్‌లు దొంగిలిస్తున్న ముఠా ఆటకట్టించారు.

మొత్తం ఏడుగురు సభ్యుల ముఠా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. నలుగురిని అరెస్ట్‌ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా 38 బైక్‌లను దొంగిలించినట్టు విచారణలో వెల్లడైంది. వీటి విలువ సుమారు 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కుర్రకారుకు బైక్‌లంటే ఫుల్‌ క్రేజ్‌ ఉంటుంది. మార్కెట్‌లోకి వచ్చే అన్ని రకాల బైక్‌లపై రైడ్‌కు వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ వీరు మాత్రం చూసిన బైక్‌ను ఎలా కొట్టేయాలని ప్లాన్‌ చేస్తారు. జల్సాల కోసం బైక్‌ల చోరికి పాల్పడుతూ చివరికి కటకటాల పాలయ్యారు.