Konda Surekha : పదవి పోయినా పార్టీను వీడను.. వచ్చేది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇక్కడ టికెట్ కొండా సురేఖదే..!
Konda Surekha : మాజీ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. బర్తరఫ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. వరంగల్ తూర్పులోనే ఉంటానని, కార్యకర్తలకు అండగా ఉంటానని, రాహుల్ గాంధీ కోసం పోరాడతామని తెలిపారు.
Konda Surekha Comments
- పదవి పోయినా కాంగ్రెస్‌ను వీడను.. ఎక్కడికీ వెళ్లేది లేదు
- బర్తరఫ్‌పై బాధ లేదు.. అకారణంగా తొలగించారనే బాధ
- మమ్మల్ని ఓడించేందుకు కుట్రలు చేశారు.. అయినా కాంగ్రెస్‌లోనే ఉంటాం
- పదవులు ఉన్నా లేకున్నా ఒక్కటే.. మేం ఇంట్లో కూర్చునే వాళ్లం కాదు
Konda Surekha : మాజీ మంత్రి కొండా సురేఖ తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను, కొండా మురళి ఏ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి, పెరిగామని, ఇకపై కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు.
రాహుల్ గాంధీ కోసం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై స్పందించిన కొండా సురేఖ.. పదవి పోయిందని బాధపడటం లేదని, అయితే ఎలాంటి కారణం లేకుండా తనను బర్తరఫ్ చేశారనే బాధ ఉందని అన్నారు. పదవులు వస్తాయి, పోతాయని.. తాను ఎంపీపీ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు.
అభిమానులు ఆందోళన చెందారు :
తనను బర్తరఫ్ చేసిన సమయంలో అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా మధనపడ్డారని కొండా సురేఖ తెలిపారు. గొడవలు, అల్లర్లు చేయాలా? అంటూ కొంతమంది ఫోన్ చేసి అడిగారని చెప్పారు. అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తానే వారికి సూచించానన్నారు.
తన మాటకు కట్టుబడి కార్యకర్తలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా సైలెంట్‌గా ఉన్నారని తెలిపారు. కొంతకాలంగా కార్యకర్తలను కలిసేందుకు ఆలస్యమైందని, సుమంత్ బెయిల్ వ్యవహారం కారణంగా హైదరాబాద్‌లో ఉన్నామని వివరించారు. గణపతి నవరాత్రులు తమకు ఉండవని, అందుకే ముందురోజే కార్యకర్తలను కలవడానికి వచ్చినట్లు చెప్పారు.
కాంగ్రెస్‌ను వీడేది లేదు :
ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు బాగోలేవని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. కొందరు ఉదయం ఒక పార్టీలో, మధ్యాహ్నం మరో పార్టీలో, సాయంత్రానికి ఇంకో పార్టీలోకి మారుతున్నారని విమర్శించారు. కార్యకర్తల కోసం నిలబడిన నాయకులకే రాజకీయంగా బలం ఉంటుందని అన్నారు.
కొండా దంపతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మంచి పేరు ఉందని పేర్కొన్నారు. తాము నమ్ముకున్న వారి కోసం మంత్రి పదవికి కూడా రాజీనామా చేశామని, ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఒక్కరోజు కూడా బాధపడలేదని చెప్పారు.
సమైక్యాంధ్రకు జగన్ మద్దతు ఇవ్వడంతో తాము బయటకు వచ్చామని, ఆ తర్వాత రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని తెలిపారు. కొన్ని కారణాల వల్ల వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్లోకి వెళ్లాల్సి వచ్చిందని, అయితే తాము స్వయంగా టీఆర్ఎస్ను వీడలేదని చెప్పారు.
వరంగల్ తూర్పులోనే ఉంటా :
తాను వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే ఉంటానని కొండా సురేఖ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. తాము ఇంట్లో కూర్చునే వాళ్లం కాదన్నారు. తమపై మాట్లాడేవారు జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. వరంగల్ తూర్పులో 50 వేల ఓట్లతో మంత్రిని ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Read Also : Konda Murali : పదవి పోతే పోనీ.. మాట తప్పం.. కాంగ్రెస్‌ను వీడేది లేదు : కొండా మురళి క్లారిటీ
గతంలో కబ్జాలు, సెటిల్మెంట్లతో ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. వరంగల్ తూర్పుకు వచ్చిన తర్వాతే ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి పరకాలకు వెళ్లడం తమ రాజకీయ జీవితంలో చేసిన పెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డారు. అక్రమ సంపాదనతో పరకాలలో నాయకులను కొనుగోలు చేసి తమను ఓడించారని ఆరోపించారు.
99 శాతం మందికి న్యాయం చేశా :
మంత్రి పదవిలో ఉండగా ఎలాంటి తప్పు చేయకుండా బాధ్యతలు నిర్వర్తించానని కొండా సురేఖ చెప్పారు. ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలతో కూడా ప్రజలు తన వద్దకు వచ్చేవారని, తన వద్దకు వచ్చిన 99 శాతం మంది ప్రజలకు న్యాయం చేశానని తెలిపారు. మంత్రి పదవి కేవలం అలంకారం మాత్రమేనని, ప్రజలకు సేవ చేయడమే అసలు బాధ్యతగా పేర్కొన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా తమకు పెద్ద తేడా ఉండదన్నారు.
మా మీద గుంటనక్కల కుట్రలు :
తమపై కొంతమంది ఎప్పటినుంచో కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఉన్న సమయంలో అలాంటి కుట్రలు పనిచేయలేదన్నారు. ఆయన మరణం తర్వాత కుట్రలు పనిచేశాయని ఆరోపించారు. కేసీఆర్ తనను పిలిచి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పారని ఆమె గుర్తు చేశారు. అనంతరం వరంగల్ తూర్పులో రాజకీయంగా పోరాడి మంత్రిని ఓడించానని తెలిపారు.
పార్టీ మారే ప్రసక్తే లేదు :
కొందరు నేతలు పదవుల కోసం పార్టీలు మారినవారేనని, ఇప్పడు వాళ్లు తమ గురించి మాట్లాడుతున్నారని కొండా సురేఖ విమర్శించారు. తాము మాత్రం అధికార పార్టీల నుంచి ప్రతిపక్ష పార్టీలకు వెళ్లామన్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీలు మారలేదని చెప్పారు. తమకు ఇతర పార్టీల నుంచి కూడా అవకాశాలు, ఫోన్లు వస్తున్నాయని ఏ పార్టీలోకి వెళ్లొద్దని కాంగ్రెస్ అధిష్టానం కోరుతోందని తెలిపారు. తాము కూడా ఎక్కడికీ వెళ్లేది లేదని స్పష్టంగా చెబుతున్నామని అన్నారు.
రాహుల్ గాంధీ కోసం పోరాటం :
కాంగ్రెస్ పార్టీతోనే తమ రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని కొండా సురేఖ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో పుట్టి, పెరిగామని.. ఇందులోనే ఉంటాయని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కోసమే తాము పోరాటం చేస్తామని అన్నారు.
వచ్చేది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ తూర్పులో కాంగ్రెస్ టికెట్ తనదేనన్నారు. పదవులు వస్తాయి.. పోతాయి. కానీ కార్యకర్తలు, ప్రజలు మన వెంట ఉండటమే అసలు బలమనేలా తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు.
