KCR survey report : కాంగ్రెస్ పాలనపై కేసీఆర్‌ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది.?

కాంగ్రెస్‌ సర్కార్‌ ఏడాది పాలన.. సీఎం రేవంత్‌పై పబ్లిక్‌ ఓపీనియన్‌ ఏంటో తెలుసుకునేందుకు ఓ సర్వే చేయించారట గులాబీ బాస్.

KCR survey report : కాంగ్రెస్ పాలనపై కేసీఆర్‌ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది.?

What does KCR survey report say about Congress rule

Updated On : January 17, 2025 / 12:46 PM IST

Gossip Garage : లోక్‌సభ ఎన్నికల తర్వాత గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. ఏవరైనా నేతలు వస్తే వ్యవసాయ క్షేత్రంలోనే మాట్లాడి.. సలహాలు సూచనలు ఇస్తున్నారు. పొలిటికల్‌గా ఎలాంటి కామెంట్స్ చేయకుండా మౌనంగా ఉంటున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు రెచ్చిగొట్టినా గులాబీ బాస్‌ మాత్రం సైలెంట్‌గా ఉండటానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయితే కేసీఆర్ మౌనం వెనుక కారణం ఏంటన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతూ వస్తున్నాయి.

కాంగ్రెస్‌ సర్కార్‌కు ఏడాది సమయం ఇవ్వాలనే కేసీఆర్‌ ఏం మాట్లాడటం లేదని కొందరు..బయటికి మాట్లాడకపోయినంత మాత్రానా మౌనంగా ఉన్నారని కాదని మరికొందరు బీఆర్ఎస్‌ నేతలు చెప్పుకొచ్చారు. అయితే ఫ్యూచర్‌ పాలిటిక్స్‌పై కేసీఆర్‌ మేథోమధనం చేస్తూనే ఉన్నారట. రాష్ట్రంలో జరిగే ప్రతీ ఇష్యూపై ఆరా తీస్తున్నారట. అంతేకాదు పబ్లిక్‌ టాక్‌ ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారట. అందులో భాగంగానే ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందంటూ ఆ మధ్య కామెంట్‌ చేశారట కేసీఆర్.

10 శాతం ఓట్లు త‌గ్గాయ్‌..

కాంగ్రెస్‌ సర్కార్‌ ఏడాది పాలన.. సీఎం రేవంత్‌పై పబ్లిక్‌ ఓపీనియన్‌ ఏంటో తెలుసుకునేందుకు ఓ సర్వే చేయించారట గులాబీ బాస్. నియోజకవర్గాల వారిగా కొద్దిరోజుల క్రితం నివేదికలు తెప్పించుకున్నారట. గ్రౌండ్‌ లెవల్‌లో బీఆర్ఎస్ పరిస్తితి ఏంటి..కాంగ్రెస్‌ పాలనపై జనం ఏమనుకుంటున్నారనే దానిపై సర్వే రిపోర్ట్‌ తెప్పించుకున్నారట కేసీఆర్‌. ఒక్కో నియోజకవర్గంలో 500 నుంచి వెయ్యి శాంపిల్స్ ద్వారా పబ్లిక్‌ ఓపీనియన్‌ తెలుసుకున్నారట. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో 10శాతం ఓట్లు తగ్గాయని కేసీఆర్‌ చేయించిన సర్వేలో తేలిందట. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఇప్పుడు మూడు శాతం ఓట్లు పెరిగాయని సర్వే రిపోర్ట్ చెబుతోందట.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2.5 శాతం ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 2023 డిసెంబర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 87 లక్షల 51 వేల 391 ఓట్లతో 37.35 శాతం ఓట్లు దక్కించుకుంది. బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 32 లక్షల 56 వేల 130 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 92 లక్షల 33 వేల 784 ఓట్లు సాధించి 39.40 శాతం ఓట్లతో 64 స్థానాల్లో విజయం దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత గులాబీ పార్టీకి చెందిన పదిమంది శాసనసభ్యులు హస్తం పార్టీలో చేరిపోయారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ లేటెస్ట్‌గా చేయించిన సర్వేలో బీఆర్ఎస్‌ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏడు శాతం ఓట్లు పెరిగాయని చెబుతున్నారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ కూడా పుంజుకుంటుందన్న సంకేతాలు సర్వే ద్వారా అందాయట. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు మరో 22 నియోజకవర్గాల్లో తమకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని గులాబీ నేతలు అంటున్నారు. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శాసనసభ్యుల్లో రెండు నియోజకవర్గాల్లో మినహా అన్ని స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులే మళ్లీ విజయం సాధిస్తారని సర్వే అంచనా వేసిందట.

ఫిబ్ర‌వ‌రిలో భారీ బ‌హిరంగ స‌భ‌..

అటు అధికార పార్టీ చేయించిన సర్వే కూడా ప్రభుత్వ ఇమేజ్ తగ్గుతుందని అంచనా వేసిందట. అందుకే కాంగ్రెస్ సర్కార్ పెద్దలు అలర్ట్ అయి..కీలకమైన రైతు భరోసా పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు గులాబీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయంటున్నారు. సర్వే ద్వారా పబ్లిక్‌ పల్స్‌ తెలుసుకున్న కేసీఆర్‌ త్వరలోనే జనాల్లో వస్తారని అంటున్నారు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెట్టి..వరుస కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారట. అందుకు మహాశివరాత్రి తర్వాత ఓ డేట్‌ను ఫిక్స్ చేయాలని డిసైడ్‌ అయ్యారట. కేసీఆర్‌ ఇప్పటికైనా బయటికి వస్తారా.? నిజంగానే గులాబీ బాస్ చేయించిన సర్వేలో కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా అన్నది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వస్తే తప్ప ఓ అంచనాకు రాలేని పరిస్థితి.