రియాక్టర్ పేలుడు ఘటన.. సిగాచీ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? దాన్ని ఎందుకు స్థాపించారు? ఫుల్ డీటెయిల్స్
ఎంసీసీపీ ఔషధ తయారీకి కీలకం. దీన్ని బైండింగ్ మెటీరియల్‌గా ఉపయోగిస్తారు.

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో రియాక్టర్ పేలుడు ఘటనలో 40 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. సిగాచీ ఇండస్ట్రీస్‌లో జరిగిన ఈ భారీ పేలుడు ఘటనతో ఆస్తి నష్టం కూడా జరిగింది. అసలు ఈ సిగాచీ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? దాన్ని ఎందుకు స్థాపించారు? వంటి వివరాలు తెలుసుకుందాం.
సిగాచీ క్లోరోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా 1989లో ప్రారంభమై, 2012లో సిగాచీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా పేరు మారింది. 2019 డిసెంబరులో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. తెలంగాణ, గుజరాత్, కర్ణాటకలో తయారీ యూనిట్లు ఉన్నాయి.
హైదరాబాద్ యూనిట్ సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 190 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
Also Read: మేడారం మహాజాతర తేదీలు ఖరారు.. ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన మేడారం పూజారులు
ఈ యూనిట్‌లో మైక్రో క్రిస్టలిన్ సెల్యూలోజ్ పౌడర్ (ఎంసీసీపీ) తయారీ జరుగుతోంది. హైదరాబాద్, గుజరాత్ యూనిట్లలో మొత్తం 59 రకాల ఎంసీసీపీ తయారీ జరుగుతోంది. వీటి వార్షిక సామర్థ్యం 11,880 మెట్రిక్ టన్నులు. ఇందులో 6,000 మెట్రిక్ టన్నులు హైదరాబాద్ యూనిట్‌లో తయారవుతున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌కు సమాచారం ఇచ్చారు.
ఎంసీసీపీ ఔషధ తయారీకి కీలకం. దీన్ని బైండింగ్ మెటీరియల్‌గా ఉపయోగిస్తారు. సిగాచీ సంస్థ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్ల(ఏపీఐ)ను కూడా తయారు చేస్తోంది. వీటిలో ప్రెగాబెలిన్, రైటోనావిర్, హెచ్‌సీఎల్ హెట్ ఫార్మిన్, ప్రొపాఫెనోన్ హెచ్‌సీఎల్ సహా తొమ్మిది రకాల ఏపీఐలు ఉన్నాయి. ఇవి న్యూరో, హెచ్ఐవీ-ఎయిడ్స్, గుండె సంబంధిత వ్యాధులకు వాడతారు.
పేలుడు ఘటన తర్వాత సిగాచీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 2021లో ఐపీవో ద్వారా 163 రూపాయల ప్రీమియంతో మార్కెట్‌లోకి ప్రవేశించి, 153 రూపాయల ధరకు లిస్ట్ అయింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఈ కంపెనీ లిస్ట్ అయింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1863.20 కోట్లు.
పేలుడు కారణంగా హైదరాబాద్ యూనిట్‌లో 90 రోజుల పాటు కార్యకలాపాలు నిలిపేశారు. సిగాచీ సంస్థ ఎండీ, సీఈవో అమిత్ రాజ్ సిన్హా. చైర్మన్ రవీంద్ర ప్రసాద్ సిన్హా. వైస్ చైర్మన్ చిదంబరనాథన్ షణ్ముగనాథన్.