KCR: సమయం లేదు మిత్రమా.. పోరాటానికి బీఆర్ఎస్ రెడీ.. పాలిటిక్స్‌లో కేసీఆర్ మళ్లీ యాక్టివ్?

ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు చాలా ప్లస్‌ అవుతుందంటున్నారు పార్టీ నేతలు.

KCR: సమయం లేదు మిత్రమా.. పోరాటానికి బీఆర్ఎస్ రెడీ.. పాలిటిక్స్‌లో కేసీఆర్ మళ్లీ యాక్టివ్?

KCR

Updated On : February 10, 2025 / 8:34 PM IST

సమయం లేదు మిత్రమా. ఇక రణమే అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ఇప్పటివరకు అటు కేటీఆర్, ఇటు హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తమ గళం వినిపిస్తూ వస్తూనే ఉన్నారు. కానీ గులాబీ దళపతి మౌనం అటు బీఆర్ఎస్ క్యాడర్‌లో..ఇటు తెలంగాణ ప్రజల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

అయినా పెద్దగా రియాక్ట్ కానీ కేసీఆర్..ఈ మధ్యే కాంగ్రెస్‌ సర్కార్‌కు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. తాను కొడితే మామూలుగా ఉండదని..ఇక బయలుదేరుడే అని ప్రకటించేశారు. ఈ నెలాఖరులోగా భారీ బహిరంగసభ పెడుదాం..అందరూ రావాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే బీసీ కులగణన అంశాన్ని అస్త్రంగా మల్చుకునే ప్రయత్నం చేస్తోందట బీఆర్ఎస్.

Also Read: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌.. మెగాస్టార్‌ చిరంజీవి పొలిటికల్‌ రీ ఎంట్రీ? ఏం జరుగుతోంది?

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ..చట్టపరంగా కుదరకపోతే..పార్టీ పరంగా ఇస్తామంటూ చెప్తోంది. అయితే కులగణన ప్రక్రియనే సరిగ్గా జరలేదని..రీసర్వే చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీసీ జనాభాను ఐదున్నరశాతం తగ్గించారని, దాదాపు 22 లక్షల మంది ఉన్నవారిని లేనట్లుగా చూపించారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

ఇదే అంశాన్ని హైలెట్‌ చేయాలని ఫిక్స్ అయిందట గులాబీ పార్టీ. అందుకే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీ నేతలతో వరుసగా భేటీ అవుతూ..కాంగ్రెస్ సర్కార్‌ ఇచ్చిన మాటను తప్పిందని ఎక్స్‌పోజ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కామారెడ్డి వేదికగా బీసీ సభ నిర్వహించి..సమరం శంఖం పూరించబోతుందట. ఈ సభకు గులాబీ దళపతి కేసీఆర్ హాజరు కాబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కులగణనే ప్రధానాంశం?
కులగణనతో తమకు ఎంతో మైలేజ్‌ వస్తుందని హస్తం పార్టీ నేతలు భావిస్తే.. అంతా తప్పుల తడక అని ప్రతిపక్షాలతో పాటు బీసీ సంఘాలు గళమెత్తుతున్నాయి. దీంతో రాజకీయమంతా బీసీ జనాభా చుట్టే తిరుగుతోంది. కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశాలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బీసీ కులగణను పొలిటికల్ ఎజెండాగా మార్చుకుంటుంది.

కులగణన సర్వే రిపోర్ట్‌ ఓ చిత్తు కాగితంతో సమానమని, ఈ మాట కాంగ్రెస్‌ ఎమ్మెల్సీనే స్వయంగా చెప్పారని రేవంత్ సర్కార్‌ను కార్నర్ చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ బీసీ నేతలతో సమావేశమై చర్చించారు. కులగణనపై సాకులు చెప్పొద్దని..రీ సర్వే చేయించాలని డిమాండ్‌ చేశారు.

అయితే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గమనిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..బీసీ కులగణన అంశంతోనే మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కామారెడ్డి వేదికగానే బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అదే కామారెడ్డి వేదికగా బీసీ రిజర్వేషన్లు, కులగణన అంశంపై పోరు మొదలు పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ నెలాఖరులో కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది కారు పార్టీ.

ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తారా?
కామారెడ్డి బీసీ ఆందోళన సభకు అధినేత కేసీఆర్ హాజరవ్వనున్నారని, అక్కడి నుంచే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ గంభీరంగా గమనిస్తున్నానని, తాను కొడితే మాములుగా ఉండదని చెప్పిన కేసీఆర్..కామారెడ్డి నుంచి సింహగర్జన స్టార్ చేయనున్నారట.

ఇప్పుడు సభ పెడితే బీసీ కులగణనపై నిరసన తెలపడంతో పాటు..కేసీఆర్ రంగంలోకి దిగితే స్థానిక సంస్థల్లో పార్టీకి లాభం చేకూరుతుందని కేటీఆర్ సహా ముఖ్యనేతలంతా భావిస్తున్నారట. అందుకే సార్‌ రంగంలోకి దిగబోతున్నారని చెబుతున్నారు గులాబీ పార్టీ లీడర్లు.

బీసీ సభతో కేసీఆర్ పొలిటికల్‌గా యాక్టీవ్‌ అయితే..ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు చాలా ప్లస్‌ అవుతుందంటున్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని..గులాబీ దళపతి పొలిటికల్‌ పిచ్‌లోకి దిగడానికి ఇదే సరైన్ టైమ్‌ అని భావిస్తున్నారు. బీసీ సభ తర్వాత కేసీఆర్ పోరు ఎలా ఉండబోతోందో చూడాలి మరి.