Gadala Srinivasa Rao: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిన గడల శ్రీనివాసరావు

కాంగ్రెస్‌ నుంచి తనకు టికెట్‌ కేటాయిస్తే బీసీ కార్డుతో విజయం సాధించి చూపిస్తానంటూ..

Gadala Srinivasa Rao: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిన గడల శ్రీనివాసరావు

Gadala Srinivasa Rao

Updated On : February 6, 2024 / 11:34 AM IST

Gadala Srinivasa Rao: ఆయనో మాజీ హెల్త్‌ డైరెక్టర్‌. కానీ రాజకీయాలంటే ఆయనకు ప్రాణం. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. తరచూ వార్తల్లో నిలుస్తూ రాజకీయాల్లోకి వచ్చేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. గత ప్రభుత్వ హయాంలో టికెట్‌ దక్కించుకునేందుకు నానా కష్టాలు పడ్డ ఆయన.. అప్పటి సీఎం కేసీఆర్‌ కాళ్లు సైతం మొక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఇంకేముంది ఆ మాజీ హెల్త్‌ డైరెక్టర్‌ కూడా మనసు మార్చుకున్నారు. ఏకంగా కాంగ్రెస్‌ నుంచి ఎంపీ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకొని మరోసారి వార్తల్లోకెక్కారు.

ఆయన పేరు గడల శ్రీనివాసరావు. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. చాలాకాలం పెద్దగా ప్రచారంలోకి రాని గడల పేరు.. కరోనా సమయంలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. కరోనా సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ మహిళా ప్రజాప్రతినిధి ఇంటి వద్ద జరిగిన పూజల్లో పాల్గొనడమే దీనికి కారణం.

ఎండు మిరపకాయలతో హోమంలో..
అవి సాధారణ పూజలే అయ్యుంటే ఎవరూ ఆశ్చర్య పడేవారు కాదు. తనకు తాను దేవతగా ప్రకటించుకున్న ఓ మహిళ ఇంట్లో ఎండు మిరపకాయలతో జరిపిన హోమంలో శ్రీనివాసరావు స్వయంగా కూర్చోవడం కలకలం రేపింది. అప్పటి నుంచి వరుసగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ఈ మాజీ హెల్త్‌ డైరెక్టర్‌.

ఇక కరోనా సమయంలో మాస్క్‌ లేకుండా ఉద్యోగులతో కలిసి డ్యాన్స్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత కూడా పలు చోట్ల డ్యాన్స్‌లు చేసి వార్తల్లో నిలిచారు గడల. ఆ తర్వాత ఓ తాయెత్తు వల్లే తాను బతికానని.. యేసుక్రీస్తు మాత్రమే ఈ ఈలోకానికి దేవుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు… సిద్ధాంతాలకు ఆకర్షితుడినై కొన్నాళ్లు నక్సల్స్‌తో కూడా తిరిగానంటూ చెప్పుకొచ్చారాయన.

కొత్తగూడెంలో ట్రస్ట్‌
ఇక తన తండ్రి పేరుతో కొత్తగూడెంలో ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన శ్రీనివాసరావు.. సేవ పేరిట రాజకీయాలు చేయడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే తరచూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఓసారి అప్పటి సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కడం సంచలనంగా మారింది. అంతేకాదు.. కేసీఆర్‌ ఆశీర్వదిస్తే కొత్తగూడెంలో బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు గడల. కేసీఆర్‌కు మించిన నాయకుడు లేరని.. ఆయనలా పాలన చేయడం ఎవరికీ సాధ్యం కాదంటూ తరచూ ప్రసంగాలు సైతం చేశారు.

అయితే గడల ఆశించినట్లుగా కొత్తగూడెం టికెట్‌ దక్కపోవడంతో కొన్నాళ్లపాటు సైలెంట్‌ అయిపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఉద్యోగానికి లాంగ్‌ లీవ్‌ పెట్టేశారాయన. పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సడెన్‌గా యూటర్న్‌ తీసుకున్నారు మాజీ హెల్త్‌ డైరెక్టర్‌. ఇన్నాళ్లూ జై కేసీఆర్‌ అన్న నోటితోనే.. ఇప్పుడు జైజై కాంగ్రెస్‌ అంటున్నారు. అంతేకాదు.. సికింద్రాబాద్‌ లేదా ఖమ్మం నుంచి తనకు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు గడల శ్రీనివాసరావు. ఇటీవలే గడల తరఫున ఆయన సన్నిహితుడు రాము ద్వారా ఈ దరఖాస్తు సమర్పించారు.

Also Read: జనసేన సీట్ల వాటాపై క్లారిటీ వచ్చినట్టేనా? పవన్ కల్యాణ్ పార్టీకి ఈ సీట్లు?

అంతేకాదు.. 25 ఏళ్ల తన ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు గడల శ్రీనివాసరావు. కాంగ్రెస్‌ నుంచి తనకు టికెట్‌ కేటాయిస్తే బీసీ కార్డుతో విజయం సాధించి చూపిస్తానంటూ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు మాజీ హెల్త్‌ డైరెక్టర్‌.