Eatala Rajendar: తెలంగాణ బీజేపీలో ఈటల మౌనం వెనుక మతలబేంటి?
ఈటల అధ్యక్షుడైతే ఆయన అనుచరులకు..ఆయన భావజాలం వ్యక్తులకే టికెట్లు ఇప్పించుకుంటారని..దాంతో పార్టీ సిద్ధాంతాలను నమ్మకుని ఉన్న నేతలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారట.

Etela Rajender
ఈటల రాజేందర్.. 20ఏళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో..తెలుగు స్టేట్స్‌లో పరిచయం అక్కర్లేని నేత. రెండు దశాబ్ధాలుగా పొలిటికల్‌గా లైమ్ లైట్‌లో ఉంటూ వచ్చిన ఆయన.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నారు.
అందుకోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఉన్న సాన్నిహిత్యంతో ప్రయత్నాలు కూడా చేశారు. ఈటలకు రాష్ట్ర రథసారధి పగ్గాలు అప్పగించేందుకు.. బీజేపీ అధిష్టానం కూడా ఒకానొక టైమ్‌లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. కిషన్‌రెడ్డి స్థానంలో ఈటల రాజేందర్‌ను స్టేట్ ప్రెసిడెంట్ చేయడం ఖాయమన్న ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. ఇప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్ పేరు వినిపిస్తోంది.
అయితే ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేందుకు ఎన్నో ఈక్వేషన్స్ అడ్డొస్తున్నాయట. ఆయన వామపక్ష భావజాలం ఉన్న PDSU నుంచి వచ్చిన నేత కావడంతో..రాష్ట్ర బీజేపీలో కొందరు ఆయనకు రాష్ట్ర పగ్గాలు దక్కకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈటలను స్టేట్ ప్రెసిడెంట్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని..పార్టీ క్యాడర్ సహకరించే పరిస్థితి ఉండదని..పలువురు బీజేపీ నేతలు అడ్డు పుల్లలు వేస్తున్నారట. అందుకు కారణం ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ లేకపోవడమేనట.
సొంత ఎదుగుదల కోసమే ప్రయత్నం అంటూ..
అంతేకాదు బీజేపీలో చేరిన తర్వాత కూడా ఈటల పార్టీ భావజాలాన్ని పూర్తిగా పునికిపుచ్చుకోవడం లేదని..సొంత ఎదుగుదల కోసమే ప్రయత్నం చేస్తున్నారని అధిష్టానం పెద్దలకు కొందరు ఫిర్యాదులు చేశారట. దీంతో భగవంతుడు కరుణించినా.. పూజారి వరమివ్వడం లేదన్న పరిస్థితిని ఫేస్ చేస్తున్నారట ఈటల. బీజేపీ పెద్దలు తనను అధ్యక్షుడ్ని చేసేందుకు సిద్ధంగా ఉన్న రాష్ట్ర నేతలు అడ్డుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అందుకే కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారట ఈటల. పార్టీ ఆఫీస్‌కు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నారట.
వామపక్ష భావజాలం ఉన్న RSU నుంచి ప్రస్థానం ప్రారంభించి..బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమం తనవంతు పోషించారు ఈటల. ఆ తర్వాత కేసీఆర్‌తో గ్యాప్ వచ్చి.. కారు పార్టీని వీడారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ ఎదుగుదుల ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందట. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు దక్కిన గౌరవం..ఇప్పుడు బీజేపీలో దక్కుతున్న గౌరవాన్ని లెక్కేసుకుంటున్న ఈటల.. అసంతృప్తిలో ఉన్నారట. ఈ విషయాన్ని మీడియా ఇంటర్వ్యూల్లో ఆయనే పలుమార్లు ఇండైరెక్టుగా చెప్పారు.
కేసీఆర్‌ను ఓడిస్తానంటూ గజ్వేల్‌లో పోటీ
ఈటల 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం హుజురాబాద్‌తో పాటు.. కేసీఆర్‌ను ఓడిస్తానంటూ గజ్వేల్‌లో పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తనకు అధ్యక్ష పదవి దక్కడం ఖాయమని భావించారు. ఇంటిపోరుతో ప్రెసిడెంట్ పదవి దక్కేలా లేదని..తగిన గౌరవం ఇవ్వడం లేదని అనుచరుల దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్నారట ఈటల. పైగా పార్టీలో బలమైన బీసీ లీడర్‌గా ఉన్న తమ నేతకు చెక్ పెట్టేలా.. ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేశారనే అభిప్రాయం..ఈటల అనుచరుల్లో వ్యక్తం అవుతుందట.
పార్టీ అధ్యక్ష పదవి కోసం ఓ రేంజ్‌లో ట్రై చేసిన ఈటల..స్టేట్ బీజేపీ లీడర్ల సహకారం లేకపోవడంతో డైలమాలో పడిపోయారట. అయితే ఈటల తన 20మంది అనుచరులకు గత ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకున్నారని..వాళ్లెవరికీ డిపాజిట్లు కూడా రాలేదని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట రాష్ట్ర నేతలు.
అంతేకాదు ఈటల అధ్యక్షుడైతే ఆయన అనుచరులకు..ఆయన భావజాలం వ్యక్తులకే టికెట్లు ఇప్పించుకుంటారని..దాంతో పార్టీ సిద్ధాంతాలను నమ్మకుని ఉన్న నేతలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారట. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవి రాదేమోనన్న డైలమాలో పడిపోయారట ఈటల. అందుకే గమ్మున ఆయన పని ఆయన చేసుకుంటున్నారట. బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎంత పోరాడినా..పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తున్నా..ఫలితం లేదని..అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈటల రాజకీయ అడుగులు ఎటువైపు పడుతాయనేది చర్చనీయాంశంగా మారింది.