చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య.. “కూతురు జాగ్రత్త.. ఆ మెుక్కులు తీర్చండి” అంటూ..
చీమలతో బతకడం తన వల్ల కావట్లేదని, తన కూతురు అన్వి జాగ్రత్త అని ఆమె తన భర్తకు లేఖ రాసింది.
Representative image
Ant Phobia: చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
తాను చీమల ఫోబియాతో చనిపోతున్నానని, తన కూతురు జాగ్రత్త అని ఆత్మహత్య లేఖ రాసి మనీషా అనే మహిళ ఉరి వేసుకుని బవన్మరణానికి పాల్పడింది. చీమలతో బతకడం తన వల్ల కావట్లేదని, తన కూతురు అన్వి జాగ్రత్త అని ఆమె తన భర్తకు లేఖ రాసింది. అన్నవరంతో పాటు తిరుపతి, ఎల్లమ్మ మెుక్కులు తీర్చాలని ఆత్మహత్య లేఖలో కోరింది. ఆమె మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చీమలకు భయపడే అంశం మనకు చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు. దానికే ఆత్మహత్య చేసుకోవడం ఏంటని ఆ ఫోబియాలేని వారు అనుకుంటారు. కానీ, ఆ ఫోబియాతో బాధపడుతున్న వారికి ఇది చాలా పెద్ద విషయం. నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నట్లు ఉంటుంది.
Also Read: బంగారం కొనుగోలుదారులకు మళ్లీ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎంతగా పెరిగాయంటే?
చీమల ఫోబియా (Myrmecophobia) అంటే చీమలను చూసినా, గుర్తు చేసినా, లేదా వాటి దగ్గర ఉన్నామన్న ఆలోచన వచ్చినా తీవ్రమైన భయం కలుగుతుంది. చీమలు వచ్చి తమను కుడతాయని, శరీరంపై పాకుతాయని భయంతో తీవ్ర ఆందోళన చెందుతుంటారు. శరీరంలో వణుకు వచ్చి, చెమటలు వస్తుంది. ఈ ఫోబియా తీవ్రంగా ఉంటే గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరి బిగుసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫోబియా ఉన్నవారి రోజువారీ జీవతం తీవ్రంగా ప్రభావితం అవుతుంది.
అయితే, ఇది నయంకాని ఫోబియా ఏమీ కాదు. సరైన కౌన్సిలింగ్ తీసుకుంటే తగ్గించుకోవచ్చు. సైకాలజికల్ థెరపీ, రిలాక్సేషన్ టెక్నిక్స్, అవసరమైతే వైద్యుల సూచనతో మందులు వాడితే తగ్గిపోతుంది. కొందరు సాలెపురుగులు, బొద్దింకలు.. ఇతర పురుగులు, కీటకాలు వంటి వాటికి కూడా భయపడుతుంటారు. ఏ ఫోబియా ఉన్నా దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. అన్నింటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయి.
