మాముళ్లు తీసుకున్న గ్రామ వాలంటీర్లపై వేటు

  • Published By: vamsi ,Published On : October 4, 2019 / 05:35 AM IST
మాముళ్లు తీసుకున్న గ్రామ వాలంటీర్లపై వేటు

Updated On : October 4, 2019 / 5:35 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వ్యవస్థ గ్రామ వాలంటీర్. ప్రతీ గడపకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ తీసుకుని వచ్చిన గ్రామ వాలంటీర్లు ఇప్పటికే విధుల్లో చేరి కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు పారదర్శంగా చేరువ చేయాలనే భావనతో ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించింది.

అయితే ప్రభుత్వ లక్ష్యాన్ని అపహాస్యం చేస్తూ లబ్ధిదారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై నలుగురు గ్రామ వాలంటీర్లపై వేటు వేశారు అధికారులు. లబ్ధిదారులకు అన్ని విధాల సాయంగా ఉండాల్సిన వారే అవినీతికి పాల్పడగా అధికారులు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా బందరు మండల పరిధిలోని రుద్రవరం ఎస్సీ కాలనీలో అక్టోబర్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పింఛన్ డబ్బును బట్వాడా అధికారి పంపిణీ చేసిన వెంటనే అదే ప్రాంతానికి చెందిన వాలంటీర్లు చుక్కా విజయవర్మ, లంకపల్లి ఒలీవ, గాడెల్లి సునీల్ కుమార్, తెనాలి వనజలు లబ్ధిదారులకు దగ్గరకు వెళ్లి దసరా మామూలు పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.50 చొప్పున వసూలు చేశారు.

ఈ విషయం గ్రామంలో వివాదం అవగా.. కొందరు లబ్ధిదారులు మామూళ్లు ఇచ్చేందుకు నిరాకరించారు. అంతేకాదు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై బందరు ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ విచారణకు ఆదేశించగా.. రుద్రవరం గ్రామ కార్యదర్శి రాధాకృష్ణన్ విచారణ నిర్వహించి ఆరోపణలు వాస్తమేనని నివేదిక అందించారు.

దీంతో వాలంటీర్ల ఎంపిక పత్రంలోని నాలుగో షరతు ప్రకారం నలుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన ఎంపీడీవో.. పింఛను పంపిణీ చేసే సమయంలోనే వాలంటీర్లు లబ్ధిదారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తుంటే అడ్డుకోని గ్రామ వీఆర్ఏ కొండేటి శివార్జునపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోకు సిఫార్సు చేశారు.

అవినీతిరహిత పాలన అందిస్తామనే సీఎం జగన్ భరోసా, హామీకి అనుగుణంగానే కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. గ్రామ వాలంటీర్లు, కార్యదర్శులు లంచాలు అడిగితే సీఎం పేషీలోని ట్రోల్ ప్రీ నెంబర్ 1902కు కాల్ చేయాలని కూడా పదే పదే చెప్పారు సీఎం జగన్. నలుగురు వాలంటీర్లను తొలగించటం సంచలనంగా మారింది. మిగతా వారు కూడా అలర్ట్ అయ్యారు.