మాతో పెట్టుకుంటే ఫినిష్ : బీజేపీకి బాబు వార్నింగ్
కాకినాడ : ఏపీ సీఎం చంద్రబాబుకి చిర్రెత్తుకొచ్చింది. కాన్వాయ్‌కి అడ్డుతగిలిన బీజేపీ కార్యకర్తలపై ఒంటికాలిపై లేచారు. ఈ పరిణామంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు బీజేపీ నేతలను లాగిపడేశారు. అయినా ముందుకు వెళ్లి కాన్వాయ్‌ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. సీఎం డౌన్..అంటూ నినాదాలు చేశారు. చివరకు బస్సును ఆపిన బాబు.. బీజేపీ కార్యకర్తలపై చిందులు తొక్కారు. మీకొక కమిట్‌మెంట్ ఉందా ? ఏం కావాలి…మోడీ చేసిన పనులు చూసి అవమాన పడాలంటూ ఓ బీజేపీ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మర్యాదగా ఉండాలన్న బాబు…
సీఎం డౌన్..డౌన్ అంటూ పెద్ద పెట్టున్న నినాదాలు చేయడంతో బాబు ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ‘డౌన్..డౌన్ కాదయ్య మీరు ఈ గడ్డ మీద ఉన్నారు..ప్రజలే మిమ్మల్ని తరిమికొడుతారు..లేనిపోని ప్రాబ్లం పెట్టుకోకండి…పెట్టుకుంటే ఫినిస్ అయిపోతారు…బయటకొస్తే చాలా ప్రాబ్లం వస్తాయి..మర్యాదగా ఉండండి..ఢిల్లీలో హక్కుల కోసం మాట్లాడితే లాఠీఛార్జీ చేయించారు’ అంటూ బాబు హెచ్చరించారు. కాకినాడలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని..స్మార్ట్ సిటీగా మారుస్తామని బాబు హామీనిచ్చి బస్సెక్కి వెళ్లిపోయారు.
ముందుగానే అరెస్టులు…
బాబు కాకినాడ పర్యటన సందర్భంగా ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందుగానే గ్రహించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు కాషాయ నేతలను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్యను..కొంతమంది కుల సంఘ నేతలను హౌస్ అరెస్టు చేశారు. అయినా కూడా పోలీసుల కన్నుగప్పి కొంతమంది నేతలు బాబు వెళ్లే రహదారికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. బాబు చేసిన వార్నింగ్‌పై బీజేపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.