విఫలమైన ఈసీ : చుక్కలు చూపించిన EVMలు
ఏపీలో జరిగిన ఎన్నికల ఏర్పాట్లలో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా EVMలు ఓటర్లకు చుక్కలు చూపించాయి.

ఏపీలో జరిగిన ఎన్నికల ఏర్పాట్లలో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా EVMలు ఓటర్లకు చుక్కలు చూపించాయి.
ఏపీలో జరిగిన ఎన్నికల ఏర్పాట్లలో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా EVMలు ఓటర్లకు చుక్కలు చూపించాయి. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు మొరాయించడంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల మధ్యాహ్నానికి కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. ఒక పార్టీ ఓటేస్తే మరోపార్టీకి పడుతుండడం తీవ్ర గందరగోళానికి తీసింది. ఈ విషయంలో ఈసీ తీరుపై పార్టీలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన చోటే వీవీప్యాట్ మొరాయించడమే ఇందుకు నిదర్శనం.
కృష్ణా జిల్లా చౌటపల్లిలో.. 172, 173 బూత్‌లలో టీడీపీకి ఓటేస్తే వైసీపీకి పడుతున్నాయంటూ ఓటర్లు ఆందోళనకు దిగారు. వెంటనే పోలింగ్ నిలిపేసి కొత్త ఈవీఎంలతో మళ్లీ ప్రారంభించారు. విజయవాడ జమ్మిచెట్టు సెంటర్ బూత్‌లో సైకిల్‌కు ఓటేస్తే బీజేపీకి పడడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడా పోలింగ్ నిలిపేశారు. క్యూలైన్లో నిలబడలేక ఓటర్లు పోలింగ్ కేంద్రానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకున్నారు. చివరికి రిపేర్లు చేసి మధ్యాహ్నం 1. 45 నిమిషాలకు పోలింగ్ ప్రారంభించారు. ఆ సమయానికి ఓటర్లంతా వెళ్లిపోయారు. ఓటేయడానికి ఎవరూ ఆసక్తి కనబరచలేదు. ఒకానొక దశలో ఈసీ డౌన్ డౌన్ అంటూ మహిళలు ఆందోళనకు దిగారు.
Read Also : పెరిగిన పోలింగ్ శాతం మాకే అనుకూలం : భారీ మెజార్టీతో గెలుపు ఖాయం
విజయవాడ లయోలా కాలేజ్‌లోని 48వ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. అటు.. పాలిటెక్నిక్ కాలేజీలో ఓటేసేందుకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను ఓటర్లు నిలదీశారు. చివరికి ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చినా కృష్ణా జిల్లాలో తొలి రెండు గంటల్లో కేవలం 3శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఈ పరిస్థితిపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ బలంగా ఉన్న చోట్ల ఈవీఎంలు పనిచేయకుండా చేస్తున్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడలోని మల్లికార్జునపేట పోలింగ్ కేంద్రం ముందు ధర్నాకు దిగారు.
గుంటూరు జిల్లా బోడిపాలెంలో ఈవీఎంలు మొరాయించడంతో 267వ పోలింగ్ కేంద్రంలో కొన్ని గంటల పాటు పోలింగ్ ప్రారంభం కాలేదు. మంగళగిరిలోనూ పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. వైసీపీకి ఓట్లు పడే చోట్ల మాత్రమే ఈవీఎంలు పనిచేయడం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో చాలా చోట్ల ఈవీఎంలు పని చేయలేదు. దీంతో క్యూలైన్లో నిలబడిన ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా గుండాలపల్లెలో ఈవీఎంలు మొరాయించడంతో మధ్యాహ్నం 12గంటలకి కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. రాయచోటిలోనూ ఇదే పరిస్థితి. మధ్యాహ్నం 12.30గంటలు దాటినా 45వ పోలింగ్ స్టేషన్‌లో పార్లమెంట్ ఓట్ల ఈవీఎం పని చేయలేదు. రెండు సార్లు మార్చినా అదే పరిస్థితి.
అనంతపురం జిల్లాలో ఈవీఎంల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేన అభ్యర్థి మదుసూదన్ గుప్తా ఈవీఎంను పగులగొట్టారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మడకశిర మండలం నీలకంఠాపురం జడ్పీ స్కూల్లో ఓటేసేందుకు ఉదయం 7 గంటలకే వచ్చిన పీసీసీ అధ్యక్షడు రఘువీరారెడ్డి ఈవీఎం మొరాయించడంతో అరగంట సేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఈసీ అధికారులు ప్రచార ఆర్భాటాల తప్ప ఆచరణ శూన్యమని ఆయన మండిపడ్డారు. ఈవీఎంల పనితీరుపై రాజకీయ నాయకులతో పాటు ఓటర్లు తీవ్ర కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పలుచోట్ల మహిళలు ఈసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
Read Also : రెడీ టు అప్లయ్ : SBIలో 8వేల 904 క్లర్క్ పోస్టులు