అమరావతిలో మహిళలపై పోలీసులు తీరు పట్ల హైకోర్టు సీరియస్

ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు, పోలీస్ యాక్ట్ 30 అమలు, విజయవాడలో ధర్నా చేసిన మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల హైకోర్టు తప్పు పట్టింది. అమరావతి రైతులు, న్యాయవాదులు,మహిళలు హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లపై శుక్రవారం విచారణ జరిపారు. పోలీసులు దాడులు చేశారని చూపిస్తున్నవి ఫేక్ ఫోటోలు అని ఏజీ వాదించారు. కాగా అడ్వకేట్ వాదనలతో పిటీషనర్ తరుపు న్యాయవాది విభేదించారు.
2014నుంచి అమరావతిలో 144 సెక్షన్ అమల్లో ఉందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. రాజధానిలో 144 సెక్షన్ పొడిగించినట్లు తెలిపారు. బెజవాడలో జరిగిన ర్యాలీలో 610 మంది మహిళనలను ఎందుకు అరెస్టు చేశారని హైకోర్టు అడిగింది. నిరసన కారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని ఏజీ కోర్టుకు వివరణ ఇచ్చారు. విజయవాడ బందరు రోడ్డులో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా రైతులను అడ్డుకున్నట్లు ఏజీ కోర్టుకు తెలిపారు.
మహిళను బూటు కాలుతో తన్నటం…మహిళ నోరు ఎందుకు బలవంతంగా నొక్కారని హై కోర్టు ప్రశ్నించింది. రాజధాని ప్రాంత గ్రామాల్లోని వీధుల్లో పోలీసులు మార్చ్ ఫాస్ట్…పరేడ్ చేయాల్సిన అవసరం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. అమరావతిలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని ఏజీ చెప్పారు. ఏజీ సమాధానంతో సంతృప్తి చెందని హైకోర్టు.. మరి ఎందుకు పోలీసు బలగాలు మోహరించారని ప్రశ్నించింది.
మగ పోలీసులు మహిళను ఎందుకు అరెస్టు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. ముందు జాగ్రత్త చర్యగా అల్లర్లు జరగకుండా పోలీసులు మోహరించారని ఏజీ సమాధానమిచ్చారు. కాగా దీనిపై సమగ్రంగా అఫిడవిట్ సమర్పించమని కోర్టు ఆదేశించింది. అందుక కొంత సమయం కావాలని ఏజీ కోరగా….తదుపరి విచారణను న్యాయస్ధానం సోమవారానికి వాయిదా వేసింది.